2014లో 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి తెలుగుదేశం పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అదే ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సలహాదారులను నియమించింది. వీరిని ప్రోటోకాల్ పరిధిలోకి తీసుకువచ్చారు కూడా. అయితే అప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి పరకాల ప్రభాకర్‌ను ప్రధాన సలహాదారుగా చంద్రబాబు నాయుడు నియమించారు. ఆయన పలు సంస్థలతో సమావేశమయ్యారు. కేంద్రంతో చర్చలు జరిపారు. వివిధ దేశాల్లో పర్యటించారు కూడా. అప్పట్లో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ... నాటి ప్రతిపక్ష వైసీపీ నేతలు మాత్రం పరకాల పోస్ట్ ఏమిటీ అంటూ ప్రశ్నలు వేశారు. ఆయనకు ప్రభుత్వం ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తోందని కూడా ప్రశ్నించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత వైఎస్ జగన్ కూడా సలహాదారుల నియామకానికి మొగ్గు చూపారు.

ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. అంతటితో ఆగకుండా... మరో పది మందిని వివిధ కారణాలతో సలహాదారులుగా నియమించారు. వీరికి ప్రతి నెలా లక్షల్లో వేతనం చెల్లిస్తోంది కూడా ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి పలు కీలక అంశాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అటు న్యాయపరంగా, ఇటు రాజకీయ పరంగా, రాజ్యాంగ పరమైన అంశాల్లో కూడా ప్రభుత్వానికి సలహాదారులు సరైన సలహాలు ఇవ్వటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ బాధ్యతలు కూడా అప్పగించారు వైఎస్ జగన్. దీంతో అటు ప్రభుత్వంతో, ఇటు పార్టీ పనుల్లో కూడా సజ్జల ఫుల్ బిజీ అయిపోయారు. ఉద్యోగ సంఘాల నేతలు, రాజకీయ విమర్శలు, పార్టీ నేతలు ఇలా ఎన్నో అంశాలు సజ్జల చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారనే అపవాదు కూడా ఉంది. అందువల్లే ఇంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ... వైసీపీ సర్కార్‌కు ఎదురుదెబ్బలు మాత్రం తప్పడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: