ఏపీ రాజకీయాల్లో మరో స్నేహ బంధం చిగురించింది. నిన్నమొన్నటివరకూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న రెండు ప్రధాన పార్టీలూ ఇప్పుడు కలిసిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను చూస్తే.. టీడీపీ, బీజేపీల బంధం ఇప్పుడు మరింతగా బలపడబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ బీజేపీ అమరావతి రాజధాని రైతుల సమస్యపై నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు తాజాగా రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. రైతులు, టీడీపీ నేతలతో కలిసి నడుస్తూ మేమూ మీవెంటే ఉన్నామని చెప్పారు. దీంతో అధికారికంగా కాకపోయినా.. అనధికారికంగా బీజేపీ, టీడీపీలు కలిసిపోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

బీజేపీ, టీడీపీలకు చెందిన నేతలందరూ అమరావతి రైతుల పాదయాత్రలో చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్నారు. ఇప్పటి వరకు కాస్త ఉప్పు నిప్పుగా ఉన్న నేతలు ఇప్పుడు పూర్తిగా కలసిపోయారు. దీంతో జనసేనకు అమరావతి రైతుల పాదయాత్రలో చోటు లేకుండా పోయింది. అమరావతి ఉద్యమంలో జనసేన నేతలకు సీన్ లేకుండా పోయింది. అసలు ఎక్కడా జనసేన నేతలు అమరావతి రాజధానికి మద్దతుగా నడుస్తున్నట్టు కనిపించడం లేదు. అమరావతి రైతుల ఉద్యమం నుంచి జనసేనను కావాలనే సైడ్ చేశారా అనే సందేహాలు కూడా జనసైనికుల్లో మొదలయ్యాయి. మొదటి నుంచి బీజేపీతో కలిసి ఉన్న జనసేనను కాదని.. ఇప్పుడిలా ఒంటరిగా టీడీపీతో కలిసి నడవడం ఏమిటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ అమరావతి రాజధాని రైతులకు మద్దతు తెలపాలని భావిస్తే.. జనసేనను కూడా అందులో భాగస్వాములను చేయాలికదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా బీజేపీ, టీడీపీలు కలిసి పోతుండటం చూస్తుంటే జనసేన నేతలకు ఏ మాత్రం రుచించడం లేదు. తమ అధినేత పవన్ ను అడ్డుపెట్టుకొని గతంలో టీడీపీ లబ్ది పొందిందని, ఇప్పుడు బీజేపీ కూడా ఇదే ధోరణి అవలంభిస్తోందని జనసేన నేతలు లోలోపల మధన పడిపోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. ఇక పవన్ అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. లేదా త్వరలోనే పవన్ కూడా బీజేపీ-టీడీపీతో కలసి పోతారేమో తేలాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: