అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు తాజాగా మరో ఐదుగురిని అరెస్ట్ చేయడంతో ఇప్పటివరకు అరెస్ట్ అయినవారి సంఖ్య 134కి చేరింది. మరికొందరు పరారీలో ఉండగా.. వారికోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. మరోవైపు అల్లర్ల నేపథ్యంలో సోషల్ మీడియా వల్ల విధ్వంసం ఎక్కువగా జరుగుతుందని భావించిన పోలీసులు అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపి వేశారు. తాజాగా వాటిని పునరుద్ధరించారు. అమలాపురం అల్లర్ల కేసులో చాలావరకు పురోగతి సాధించామని, కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని చెబుతున్నారు పోలీసులు.

కోనసీమ జిల్లా పేరు మార్పుకోసం మొదలైన ఉద్యమం కారణంగా అమలాపురంలో అల్లర్లు మొదలయ్యాయి. ఆ తర్వాత అవి హింసాత్మకంగా మారాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్న అమలాపురం, అంబాజీ పేట, ఉప్పల గుప్తం, అయినవెల్లి, కొత్తపేట, అల్లవరం, ముమ్మిడివరం, రావులపాలెం మండలాల్లో పోలీసులు ఇంటర్నెట్ నిలిపివేశారు. అమలాపురం సహా పలు మండలాల్లో 144 సెక్షన్ విధించి శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రయత్నించారు. మరోవైపు పరిస్థితి అదుపుతప్పడానికి కారణం.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడమేనని గుర్తించారు. అందుకే అక్కడ ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. రోజు రోజు ఆ గడువు పొడిగించుకుంటూ పోతూ చివరకు మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో అక్కడ ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చారు.

ఇక అల్లర్లకు సంబంధించి పోలీసులు సంయమనం పాటించారని ఓ వర్గం అంటుంటే.. పోలీసులు సకాలంలో స్పందించకుండా విఫలం అయ్యారని మరో వర్గం వాదిస్తోంది. అయితే అల్లర్ల కారణంగా బస్సులు తగలబెట్టడం, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు అంటించడం వంటి ఘటనలు కూడా జరిగాయి. వాటివల్ల ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం జరిగిందంతే.. ఆ తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో జిల్లాలో బలగాలను మోహరించి.. తదనంతరం ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో 144 సెక్షన్, ఇంటర్నెట్ సేవల రద్దు కారణంగా కొంతమంది ఇబ్బంది పడినా.. ఇప్పుడు కోనసీమ జిల్లాలో పరిస్థితి ప్రశాంతంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: