వచ్చేనెలలో భర్తీచేయాల్సిన రాష్ట్రపతి పదవికి పోటీ తప్పేట్లులేదు. రాష్ట్రపతి అభ్యర్ధిని ఏకగ్రీవంగా ఎంపికచేయాలని నరేంద్రమోడి పైకి నాటకాలు ఆడుతున్నా లోలోపల మాత్రం తాను అనుకున్న అభ్యర్ధే రాష్ట్రపతి కావాలని బలంగా కోరుకుంటున్నారు. సరే ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా కోరుకోవటంలో తప్పుకూడా లేదు. మరిదే సమయంలో ప్రతిపక్షాలు ఏమిచేస్తున్నాయి. ఏమిచేస్తున్నాయంటే నాన్ ఎన్డీయే పక్షాలు కూడా గట్టి అభ్యర్ధిని రెడీచేస్తున్నట్లు అనిపిస్తోంది.





ప్రతిపక్షాలు, నాన్ ఎన్డీయే పార్టీల్లో మెజారిటి పార్టీలు శరద్ పవార్ అభ్యర్ధి అయితే బాగుంటుందని కోరుకుంటున్నాయి. దేశంలోని అత్యంత సీనియర్ నేతల్లో పవార్ కూడా ఒకరు. కేంద్రంలో చాలాసార్లు మంత్రిగా పనిచేశారు. మహారాష్ట్రకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. లోక్ సభకు చాలాసార్లు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘమైన రాజకీయ నేపధ్యం ఉండటంతో చాలా పార్టీల అధినేతలతో పవార్ కు సన్నిహిత సంబంధాలున్నాయి.





ఒకపుడు ప్రధానమంత్రి కుర్చీమీద బాగా ఆశపడి తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేసుకున్నారు. అయితే ఆ పదవి తనకు దక్కే అవకాశంలేదని ఎప్పుడైతే అర్ధమైపోయిందో అప్పటినుండి ఆశలు వదిలేసుకున్నారు. ఈయనకు అతిపెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే ఇంగ్లీషు మాట్లాడలేకపోవటం. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, శివసేన లాంటి పార్టీలు పవార్ కు మద్దతిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఈనెల 15వ తేదీన ఢిల్లీలో జరగబోయే కీలక సమావేశంలో ప్రకటిస్తారేమో చూడాలి.






ఇదే సమయంలో  ఎన్డీయే తరపున ద్రౌపధి ముర్మును నిలబెట్టాలని మోడికి బలంగా ఉందట. ఒడిస్సాకు చెందిన ద్రౌపది కూడా సీనియర్ నేతే. గతంలో ఝార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. ట్రైబల్ నేతయినా ద్రౌపది అనేక కారణాల వల్ల వెలుగులోకి రాలేకపోయారు. నిజంగానే ద్రౌపదిని పోటీచేయిస్తే రాష్ట్రపతి పదవికి మొదటిసారి పోటీచేసిన ట్రైబల్ నేతగా ఆమె రికార్డు సృష్టిస్తారు. పోటీ తప్పనిసరైనపుడు ద్రౌపది గనుక గెలిస్తే ఇక చెప్పాల్సిన అవసరమేలేదు. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే నాన్ ఎన్డీయే పక్షాల తరపున శరద్ పవార్, ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ముయే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: