ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. తొలిరోజు అవి అమలులోకి వచ్చాక వాటి వడ్డింపు ఏ స్థాయిలో ఉందో ప్రజలకు అర్థమైంది. పల్లె వెలుగు బస్సుల్లో కూడా భారీగా మోత మోగింది. ఇప్పటి వరకూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు రేట్లు పెంచారు. అంటే దాదాపుగా 2వేల కోట్ల రూపాల భారం ప్రజలపై పడిందనమాట. అయితే అందులో పల్లె వెలుగు సర్వీసుల వాటా ఎక్కువ. పల్లె వెలుగు బస్సుల్లో అత్యధికంగా 61.90 శాతం మేర ఛార్జీలు పెరిగాయని తెలుస్తోంది. ఇది గ్రామీణ ప్రజలు మోయలేని భారమేనని చెప్పాలి. ఎక్స్‌ ప్రెస్‌ సర్వీసుల్లో 43.67 శాతం, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో 39.65 శాతం, ఇంద్ర ఏసీ బస్సుల్లో 34.24 శాతం మేర చార్జీలు పెంచారు.

ఏపీఎస్ఆర్టీసీలో 49శాతం బస్సులు పల్లెవెలుగు సర్వీసులే. ఆటోల బాదుడు భరించలేక, సొంత వాహనాలు లేక.. ప్రజలు ఆర్టీసీని ఆశ్రయిస్తుంటారు. ఇక్కడ కూడా ఆటోలకు తీసిపోకుండా రేటు ఉంటే ఇంకేంచేస్తారు. కానీ పల్లె వెలుగు బస్సుల్లోనే ఇప్పుడు రేట్లు భారీగా పెరిగాయి. ఇంచు మించు ఆటో చార్జీలకు సమానంగా రేట్లు పెరగడం గమనార్హం. ఇప్పటి వరకూ వైసీపీ వచ్చాక మూడు సార్లు చార్జీలు పెరగడంతో అత్యథిక భారం పడింది. పల్లెవెలుగుల్లో 2019 నవంబరులో కిలోమీటరుకు 63 పైసల చొప్పున టికెట్ రేటు ఉండగా ఇప్పుడది 1.02 రూపాయలకు చేరింది. అంటే.. 61.9 శాతం పెరిగిందనమాట.

ఈ ఏడాది ఏప్రిల్‌ 14 నుంచి డీజిల్‌ సెస్‌ పేరిట పెరిగిన చార్జీలు అమలులోకి వచ్చాయి. ప్రతి ఏటా మరో 720 కోట్ల రూపాయల మేర భారం పడింది. తాజాగా శుక్రవారం నుంచి మరోసారి చార్జీలు పెరిగాయి. టికెట్‌ ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై ప్రతిఏటా 500 కోట్ల రూపాయల భారం పడుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ వచ్చిన తర్వాత మూడు సార్లు పెంచిన చార్జీలతో ప్రతి ఏటా దాదాపు 2వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతోంది.

గతంలో ఆర్టీసీ ఛార్జీలు ఒకసారి పెంచితే మరోసారి పెంచడానికి ప్రభుత్వం ఇబ్బంది పడేది. ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుందని అనుమానించేది. కానీ ఇప్పుడు డీజిల్ సెస్ పేరుతో మోత మోగిపోతోంది. గతంలో డీజిల్ రేట్లు పెరిగినా చార్జీలు పెంచలేదని, ఇప్పుడు పెంచక తప్పడంలేదని చెబుతోంది ప్రభుత్వం. ఈ మాటల్లో వాస్తవం ఎంతున్నా.. పెరిగిన టికెట్ రేట్లతో పేదలు ఇబ్బంది పడుతున్నారనేది మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: