మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తుచేస్తున్న సీబీఐ మరీ ఇంత అధ్వాన్నంగా ఉందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గడచిన నాలుగేళ్ళుగా మర్డర్ కేసును దర్యాప్తుచేస్తున్న సీబీఐ నివేదిక మరీ ఇంత పేలవంగా ఉందా అంటు సుప్రింకోర్టు మండిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా కేసును విచారిస్తున్న సీబీఐ హత్యకు దారితీసిన కారణాలను ఎందుకని చెప్పలేకపోతోందని సూటిగా ప్రశ్నించింది. హత్యకు కారణం సింపుల్ గా రాజకీయ వైరం అని మాత్రమే అన్నీచోట్లా ఉండటాన్ని ఎత్తిచూపింది.

ఒక హత్యకు కారణం రాజకీయ వైరమే అని చెబితే సరిపోతుందా అని నిలదీసింది. నిందితులను దోషులని చెప్పటానికి సీబీఐ అందించిన నివేదిక ఏ రకంగా కూడా సరిపోదని స్పష్టంగా చెప్పేసింది. హత్య వెనుక కుట్రను బయటపెట్టలేకపోవటం, నిందితుడు దస్తగిరి వాగ్మూలం తప్పించి నివేదికలో మరో విషయమే లేదని సుప్రింకోర్టు కామెంట్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. హత్యకు రాజకీయ వైరమే అని చెప్పిన సీబీఐ ఆ వైరం ఏమిటో మాత్రం చెప్పలేకపోయింది.

దీన్నే ప్రధానంగా సుప్రింకోర్టు ఎత్తిచూపి వాయించేసింది. నాలుగున్నరేళ్ళు దర్యాప్తుచేసిన అధికారి స్పష్టంగా ఏమీ తేల్చలేకపోవటంతో సుప్రింకోర్టు మండిపోయింది. అందుకనే దర్యాప్తు అధికారిని వెంటనే మార్చేయమని ఆదేశించింది. చివరకు సీబీఐ లాయర్ వాదనతో మెత్తబడింది. ఇపుడు దర్యాప్తుచేస్తున్న ఎస్పీ  రామ్ సింగ్ తో పాటు మరో కొత్త అధికారిని కూడా నియమించాలని ఆదేశించింది.

సుప్రింకోర్టు తాజా ఆదేశాలతో సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. ఎలాగంటే కొత్తగా నియమితులయ్యే అధికారి కేసును మొదటినుండి స్టడీ చేయాలి. మళ్ళీ నిందుతులను, అనుమానితులను, సాక్ష్యులను అందరినీ విచారించాలి. రామ్ సిగ్ దర్యాప్తు విభేదిస్తే కొత్త విషయాలు అనేకం వెలుగుచూసే అవకాశముంది. పోనీ పాత అధికారి దర్యాప్తు ఆధారంగానే కొత్త అధికారి కూడా ముందుకెళితే మళ్ళీ సుప్రింకోర్టులో చివాట్లు తప్పవు. ఎందుకంటే రామ్ సిగ్ నాలుగేళ్ళు దర్యాప్తు చేసి సాధించింది ఏమీలేదు కాబట్టి. మొత్తంమీద చూస్తేంటే వివేకా మర్డర్ కేసు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: