యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  యెస్‌ బ్యాంక్‌ ‘పునర్‌వ్యవస్థీకరణ పథకం 2020’ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ నెల 18కల్లా బ్యాంక్‌పై విధించిన మారటోరియం ఎత్తివేయనున్నారు. శని, ఆదివారాలు బ్యాంకింగ్‌ సెలవులు కావడంతో బుధవారంకల్లా మారటోరియంను ఎత్తవేయనున్నారు.  

 

దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో యెస్‌ బ్యాంక్‌ ఐదో అతిపెద్ద బ్యాం క్‌. మొత్తం దేశీయ బ్యాంకింగ్‌ రుణాల్లో యెస్‌ బ్యాంక్‌కు చెందినవి 2.3 శాతం ఉండగా, డిపాజిట్ల వాటా 1.6 శాతంగా ఉంది. ఇంత‌టి కీల‌క‌మైన యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ నెల 5న మారటోరియం విధించింది. వచ్చే నెల 3వరకు ఒక్కో డిపాజిటర్‌ రూ.50వేలకు మించి నగదును ఉపసంహరించుకోవడానికి వీల్లేకుండా పోయింది. అంతేగాక ప్రస్తుత బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ.. ప్రశాంత్‌ కిశోర్‌ను పాలకుడిగా నియమించిన సంగతీ విదితమే. తాజాగా, సీఈవో, ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ నేతృత్వంలో కొత్త బోర్డు ఈ నెలాఖరుకల్లా ఏర్పాటు కానుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సునీల్‌ మెహెతా (పీఎన్‌బీ మాజీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌), నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా మహేశ్‌ కృష్ణమూర్తి, అతుల్‌ భేడను నియ‌మించింది.

 

ఇదిలాఉండ‌గా, యెస్‌ బ్యాంక్‌లో మెజారిటీ వాటా ఆయా బ్యాంకర్ల వద్దనే ఉండనుంది. పునర్‌వ్యవస్థీకరణ పథకంలో భాగంగా యెస్‌ బ్యాంక్‌లో ఎస్బీఐ 49 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. 725 కోట్ల షేర్లను రూ.10 చొప్పున రూ.7,250 కోట్లతో పొందనుంది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కూడా 100 కోట్ల షేర్ల చొప్పున రూ.2,000 కోట్లతో సొంతం చేసుకుంటున్నాయి. యాక్సిస్‌ రూ.600 కోట్ల (60 కోట్ల షేర్లు)ను, కొటక్‌ మహీంద్రా రూ.500 కోట్ల (50 కోట్ల షేర్లు)ను, బంధన్‌, ఫెడరల్‌ బ్యాంక్‌లు రూ.300 కోట్ల (30 కోట్ల షేర్ల చొప్పున) చొప్పున పెట్టుబడులు పెట్టనున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: