కరోనా వైరస్ కారణంగా దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం పూర్తిగా నిర్బంధం లోకి వెళ్ళింది . ఈ ఒక్క రాష్ట్రమేనా...రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాలు కూడా ఇదే పద్దతిని అనుసరిస్తాయా? అన్న అనుమానాలు లేకపోలేదు  . ఎందుకంటే దేశం లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుండడమే దానికి కారణమన్నది నిర్వివాదాంశమే .  కరోనా వైరస్ కట్టడి లో భాగంగా రాజస్థాన్ ఇప్పటికే  పూర్తిగా నిర్బంధాన్ని ప్రకటించింది . శనివారం అర్ధరాత్రి నుంచి అత్యవసర సేవలు మినహా , అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు .

 

ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు . ప్రజలు వీధుల్లోకి రాకుండా స్వీయ నిర్బంధాన్ని పాటించాలని కోరారు .  పేదలకు ఆహార పొట్లాలను సరఫరా చేయనున్నట్లు తెలిపారు . రాజస్థాన్ లో శనివారం ఒక్క రోజే ఆరుగురు కరోనా బారిన పడగా, ఇందులో నాలుగేళ్ళ బాలిక కూడా ఉండడం ఆందోళన కలిగించే విషయం . రాజస్థాన్ తోపాటు పంజాబ్ , మహారాష్ట్రలోను పరిస్థితి చేయి  దాటుతుండడం తో ,  ఆయా రాష్ట్రాల్లోను కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి . ఇప్పటికే పలు ఆంక్షలను విధించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు , పరిస్థితి మరింత చేయి దాటితే షట్ డౌన్ చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నాయి . ఇక తెలంగాణలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ , రోజు, రోజుకి పెరుగుతోన్నకరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య చూసి అవసరమైతే నిర్బంధానికి కూడా వెనక్కిపోయేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు .

 

ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ సర్కార్ , ఇక  పొరుగు రాష్ట్రాల  సరిహద్దులను కూడా మూసివేయాలని యోచిస్తోంది . ఇక కేంద్రం ప్రకటించిన 14 గంటల జనతా కర్ఫ్యూ ను 24 గంటల పాటు కొనసాగించాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు . కరోనా ను ఎదుర్కొనేందుకు ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామని , ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన చెప్పుకొచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి: