తెలుగుదేశం పార్టీ పుట్టుకే ప్రభంజనం. దానికి నారూ నీరూ పోసింది తెలుగు ప్రజల గుండెల్లో దైవాంశ సంభూతునిగా ఉన్న అన్న నందమూరి తారకరామారావు. ఆయన పెట్టిన పార్టీ అది. పెట్టుబడి అవసరం లేని పార్టీ. జనమే కొండంత అండగా కదలిన పార్టీ. తెలుగు దేశం పిలుస్తోంది కదలిరా అంటే వెల్లువలా కోట్లాడి జనం వచ్చి జెండా పట్టుకున్నారు.

 

అన్న ఎన్టీయార్ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం. ఆయన చెప్పింది చేస్తారు. రాజకీయాలు తెలియవు. ఆయన ప్రజల మేలు కోసం పార్టీ పెట్టారు. పేదవాళ్ళే ఆయనకు దైవం. ఇలా జనం ఎంతో విశ్వాసం తో ఎన్టీయార్ని ఆదరించారు. ఎన్టీయార్ వెంట మూడు అసెంబ్లీ, రెండు  పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు జనం నడచింది. బంపర్ మెజారిటీ కట్టబెట్టింది.

 

ఎన్టీయార్ మొత్తం తన పద్నాలుగేళ్ళ రాజకీయ  జీవితంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అన్ని సార్లూ జనం ఆయన్ని సమాదరించారు. అరకొర మెజారిటీ, అత్తెసెరు సీట్లు ఎన్టీయార్ జీవితంలో లేవు. చంద్రబాబు సీఎం అయ్యాక మాత్రమే  టీడీపీ ప్రభంజం అన్న మాట మరచిపోయింది.

 

పైగా పొత్తులు పెట్టుకుని అరకొర మెజారిటీతో గద్దెనెక్కిన బాబు పార్టీ బలాన్ని నానాటికీ తగ్గించేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు రాణించిన టీడీపీ ఇపుడు ఏపీలో కూడా కుదేలై కునారిల్లింది. ఈ రోజుకు తీసుకుంటే టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. 

 

సరిగ్గా 38 ఏళ్ళ క్రితం మార్చి 29న ఎన్టీయార్ పెట్టిన తెలుగుదేశం ఇపుడు శిధిలావస్థకు చేరుకుందా అన్ని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఎన్టీయార్ హయాంలో నాయకత్వం గట్టిగా ఉండేది, పైగా సమ్మోహన శక్తిగా ఎన్టీయార్ అతి పెద్ద ఆస్తిగా ఉండేవారు. చంద్రబాబు వ్యూహాలతోనే రెండు సార్లు బీజేపీతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు తప్ప పార్టీని విస్తరించలేకపోయారు.

 

అదే ఇపుడు టీడీపీకి అతి పెద్ద సమస్య అయి కూర్చుంది. పార్టీ బలంగా ఉంటేనే ఏ వ్యూహమైనా పనికివస్తుంది. పార్టీ బలం లేని వేళ ఏ ఎత్తులు వేసినా చిత్తు కాకతప్పదు. మొత్తం మీద చూసుకుంటే అన్న ఎన్టీయార్ టీడీపీని పెట్టిన ఉత్సాహం, ఉత్తేజం మచ్చుకైనా లేని టీడీపీ ఇపుడు కళ్ళ ముందు ఉంది. మళ్ళీ గత వైభవం వస్తుందా అంటే సమాధానం అంత సులువుగా దొరకదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: