భార‌త్‌లో క‌రోనా వైర‌స్ రోజురోజుకూ తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. కొవిడ్‌-19 పాజిటివ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఏకంగా 3619 పాజ‌టివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 97మంది మృతి చెందారు. 212మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్న‌ట్లు అధికార వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే.. ఇండియాలో కొవిడ్‌-19 బారిన ప‌డుతున్న వారిలో ఎక్కువ‌గా 21 నుంచి 40ఏళ్ల వ‌య‌స్సు వాళ్లే ఉన్న‌ట్లు కేంద్ర‌వ‌ర్గాలు చెబుత‌న్నాయి. న‌మోదైన మొత్తం కేసుల్లో 60ఏళ్ల‌లోపు వాళ్లు 83శాతం ఉన్నార‌ని, కేవ‌లం 17శాతం మాత్ర‌మే మిగ‌తా వారు అంటే వృద్ధులు ఉన్న‌ట్లు పేర్కొంటున్నాయి. 

 

ఈ 83శాతంలో ఎక్కువ‌గా 21 నుంచి 40ఏళ్ల మ‌ధ్య ఉన్న‌వారు అత్య‌ధికంగా ఉన్న‌ట్లు కేంద్ర అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇత‌ర దేశాల్లో చ‌దువు కోసం వెళ్లిన వారు. ఉద్యోగాల రీత్యా వెళ్లిన వారు ఉన్నార‌ని, వీరే కొవిడ్‌-19 బారిన ప‌డుతున్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే.. ఇక్క‌డ  మ‌రొక విష‌యం ఏమిటంటే.. కొవిడ్‌-19 బారిన ప‌డుతున్న‌వారిలో వృద్ధులు త‌క్కువ మందే ఉన్నా.. మృతి చెందుతున్న వారిలో వీరే ఎక్కువ‌శాతం ఉన్న‌ట్లు ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, వ‌య‌స్సు మీద ప‌డ‌డంతో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌డంతో మ‌ర‌ణాల శాతం ఎక్కువ‌గా ఉంటున్న‌ట్లు అభిప్రాప‌డుతున్నారు.

 

డ‌యాబెటిస్‌, గుండె స‌మ‌స్య‌లు, బీపీ ఉన్న‌వాళ్లు కొవిడ్‌-19 ను ఎదుర్కోలేక‌పోతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మ‌ర్క‌జ్ జమాతె ఉదంతం త‌ర్వాత ఒక్క‌సారిగా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల్లో సుమారు 30శాతం జామ‌తెకు లింకున్న కేసులే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ స్వీయ‌నియంత్ర‌ణ పాటించాల‌ని, సామాజిక దూరంతోనే క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్ట‌వ‌చ్చున‌ని ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి 9గంట‌ల‌కు 9నిమిషాల‌పాటు విద్యుత్ లైట్ల‌ను బంద్ చేసి, దీపాలు వెలిగించి మ‌న సంక‌ల్ప‌బ‌లాన్ని చాటాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: