ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా మహమ్మారి.. భారత్‌నూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. చాలామంది ఇప్పుడు మొబైల్‌ ఫోన్లు, టీవీల దగ్గర్నుంచి.. బైకులు, కార్లు, ఇళ్ల దాకా అన్ని కొనుగోళ్లను వాయిదా వేసేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలేకాదు.. సంపన్న వర్గాలూ ఖర్చులపై ఓ కన్నేస్తున్నారు. ముఖ్యంగా కుదేలైన వినియోగ సామర్థ్యం ఇప్పుడప్పుడే పుంజుకునేలా లేదు. చౌక వస్తువుల కోసం అన్వేషణ.. కొనుగోళ్ల వాయిదా.. ఇవీ ఇప్పుడు మన మార్కెట్‌కు ఎదురవుతున్న సవాళ్లు. ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా అన్ని రంగాలపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. కోటి ఆశలతో పరుగులు తీస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకనే ఈ వైరస్‌ విరిచేసింది. 

 


లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభావితమైన ప్రజల ఆదాయం.. వ్యాపార రంగాన్ని కళ తప్పేలా చేసింది. నిత్యావసరాల దుకాణాలు మినహా మిగతా అన్ని ఉత్పత్తుల క్రయవిక్రయాలు స్తంభించిపోయాయి. కరోనా అనంతర కాలంలోనూ వీటికి డిమాండ్‌ ఉంటుందన్న భరోసా కనిపించడం లేదు. దీంతో అటు హోల్‌సేల్‌, ఇటు రిటైల్‌ మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ పరిణామం అన్ని రంగాలను ప్రభావితం చేస్తుండగా.. దేశ ఆర్థిక ప్రగతి చక్రాలనే కూలదోస్తున్నది. వ్యక్తిగత, సంస్థాగత ఆదాయాలు పడిపోయి యావత్‌ దేశాభివృద్ధే ప్రమాదంలో పడుతున్నది.

 

కాగా, క‌రోనా కార‌ణంగా చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. అసలే రెండేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న ఆర్థికవ్యవస్థలో ఏ పరిశ్రమ కూడా స్థిరంగా ఉన్నామని చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఊహించని ఈ సంక్షోభంతో పరిశ్రమల వెన్ను విరిగినట్టేనని పారిశ్రామికవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) నిర్వహించిన తాజా సర్వేలో చిన్నాపెద్ద అన్న తేడాలేకుండా పారిశ్రామికవేత్తలంతా ప్రభుత్వం ఆదుకోకుంటే తాము మళ్లీ కంపెనీలను తెరువలేమని చేతులెత్తేశారు. ధృవ అడ్వైజర్స్‌తో కలిసి నిర్వహించిన సర్వేలో 72శాతం కంపెనీలు తాము తీవ్రం నుంచి అత్యంత తీవ్రమైన కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత మళ్లీ అమ్మకాలు సాధారణ స్థితికి వస్తాయో లేదోనని 70శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా అనుకున్న విస్తరణ ప్రణాళికలను వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిపాటు వాయిదా వేసుకోవాల్సిందేనని 61శాతం మంది అభిప్రాయపడ్డారు. 60 శాతం మంది తమ కంపెనీల్లోకి నిధుల సేకరణ ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు. 25శాతం మంది అలాంటి ప్రణాళికలు పూర్తిగా రద్దుచేసుకుంటున్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: