కన్నడ సినీ, రాజకీయ రంగాలను డ్రగ్స్ వివాదం ఊపేస్తోంది. నిందితుడికోసం వివేక్ ఒబెరాయ్ ఇంటిలో బెంగళూరు పోలీసులు సోదాలు చేశారు. నిందితుడు వివేక్‌కు బంధువని, ఆయన ఇంటిలో ఉన్నాడన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

శాండిల్‌ వుడ్‌ డ్రగ్ లింకులపై దర్యాప్తు జోరుగా సాగుతోంది. ఈకేసులో డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నాయంటూ హీరోయిన్లు సంజనా, రాగిణిలను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఊచలు లెక్కిస్తున్నారు. దీంతో నెక్స్ట్ ఎవరి వంతు వస్తుందోనని.. శాండిల్‌ వుడ్ ఇండస్ట్రీ ఆందోళన చెందుతోంది.

ఈకేసు విచారణలో భాగంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో బెంగళూరు పోలీసులు సోదాలు చేశారు. డ్రగ్స్‌ కేసులో నిందితుడు ఆదిత్య అల్వా కోసం, అతడి బంధువైన వివేక్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆదిత్య అల్వా పరారీలో ఉన్నాడనీ, వివేక్‌ ఇంట్లో ఉన్నట్టు తమకు పక్కా సమాచారం ఉండడంతో.. సోదాలు చేసినట్టు పోలీసులు తెలిపారు. కోర్టు వారెంట్‌ తీసుకున్న తర్వాతే క్రైం బ్రాంచ్‌ పోలీసులు వివేక్‌ ఇంటికి వెళ్లారని.. బెంగళూరు సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ స్పష్టం చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య అల్వా.. కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్‌ అల్వా కొడుకు. శాండిల్‌వుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ వినియోగం, సరఫరా కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు స్పీడందుకున్న సమయంలో ఆదిత్య పరారయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మొత్తానికి కన్నడ నాట సినీ, రాజకీయ రంగాలను మాదక ద్రవ్యాల వివాదం దెయ్యంలా పట్టి పీడిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటికి వస్తుందో.. ఎవరు కటకటాలు లెక్కించాల్సిందోనని కొందరు తెగ టెన్షన్ లా ఫీలవుతున్నారు.  మరోవైపు మాదక ద్రవ్యాల కేసులో సంబంధం ఉన్న వారిపై దర్యాప్తు జోరుగా సాగుతోంది. ఈ కేసులో పలువురు నటీనటులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. చూద్దాం.. ముందు.. ముందు ఏం జరుగుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: