చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సిఎం వైఎస్ జగన్ కు ఒక లేఖ రాసారు. తన ఆవేదనను ఆయన తన లేఖలో వెల్లడించారు.

“గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి... చిత్తూరు జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, మత్తేరి మిట్ట పంచాయతీ,శ్రీహరికోట కాలనీ గ్రామానికి చెందినవాడిని. మాకు శ్రీసిటీ సెజ్ దగ్గర 74-2 సర్వే నెంబర్లో 3.4 ఎకరాల పొలం ఉంది. పొలములో వేరుశెనగ ,మల్లెపూలు మరియు మొదలగు పంటలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాం. అయితే గత పది సంవత్సరాల నుండి శ్రీ సిటీ వారు మా భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. మా మీద దౌర్జన్యం కొనసాగిస్తున్నారు.

కానీ మేము వారు పెట్టే ఒత్తిడిని ఎదుర్కొంటు, మా భూమిని సాగు చేసుకుంటున్నాం. వారికి మేము మా భూమిని ఎందుకు ఇవ్వడం లేదంటే 1972 సంవత్సరంలో శ్రీహరికోట (షార్) రాకెట్ లాంచింగ్ స్టేషన్ కోసం అక్కడ  మా  భూమిని తీసుకుని బదులుగా ఇక్కడ అనగా ఇప్పటి శ్రీసిటీ లో  భూమిని కల్పించారు. మేము ఆ భూమిపై ఆధారపడుతూ గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా... ఈ రోజు వరకు వరకూ సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాము. అయితే ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ప్రవేశపెట్టిన ఎటువంటి పథకాలు మాకు అందలేదు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాకు ఎందుకు అందడంలేదని ఎమ్మార్వో గారిని అడగగా తాసిల్దారు గారు మీ భూములు జప్తు చేయబడినవి, వాటిపై  మీకు ఎలాంటి హక్కులు లేవని మమ్మల్ని బెదిరించారు. ఆ సమాధానం విని మేము వెంటనే జిల్లా కలెక్టర్ గారికి స్పందన ద్వారా రెండు సార్లు  అర్జీ ఇవ్వడం జరిగింది. మరియు గ్రామ సచివాలయం లో సెక్రటరీ గారికి, వాలంటరీ  గారికి కూడా తెలియజేయడం జరిగింది. మా భూములపై మాకు సర్వ హక్కులు కల్పించి,   మాకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరుచున్నాము.

మా భూమి కి సంబంధించి మా దగ్గర పట్టా పాసు పుస్తకాలు ఒరిజినల్స్ తీసుకొని వెళ్లి పలుమార్లు ఎమ్మార్వో గారిని కలిసి 1B అడంగల్ ఆన్లైన్లో చేయమని కోరగా అందుకు సమాధానం ఇవ్వకుండా మాకు న్యాయం చేయకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల నిలిచే దేవుడిగా మాకు అండగా ఉంటారని నమ్ముతూ ఈ లేఖ రాయడం జరిగింది. మాపై దయవుంచి, మా భూములు మాకే  ఇప్పించవలసిందిగా రెండు చేతులు జోడించి నమస్కరించి కోరుకుంటున్న” అని తన లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: