టిఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రేటర్ లో ఏదో ఒక రకంగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలి అని ప్రయత్నిస్తున్న రేవంత్ గ్రేటర్ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను హైలెట్ చేస్తూ , టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.ఏడాది తిరిగేలోపు డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఏడేళ్లయినా,  ఎవరికి ఇచ్చింది లేదని, కోడి కోసి దావత్ ఇవ్వాలంటూ అడ్రస్ లేకుండా పోయారు అంటూ విమర్శించారు. లాక్ డౌన్ లో ఎంతోమంది  కష్టాల పాలు అయినా, నల్లా బిల్లు , ఇంటి పన్ను , కరెంటు బిల్లును రద్దు చేసే ధైర్యం లేకపోయింది అని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒకేసారి మూడు నెలల బిల్లులు ఇవ్వడంతో,  స్లాబులు పెరిగి ఒక్కో కుటుంబంపై రెండు నుంచి మూడు వేల రూపాయల భారం పడింది అంటూ గుర్తు చేశారు. అలాగే పది వేలు వరద సాయం  ఇస్తానని చెప్పి టిఆర్ఎస్ నేతలు 5 వేల నుంచి 7 వేల రూపాయలు తీసుకున్నారని మండిపడ్డారు.




   ఏడేళ్లలో ఏనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం డ్రైనేజీలు పై కప్పు వేయలేదని, కాలవలో చెత్త తొలగించ లేదని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగానే శ్రీ మేధా సైకిల్ మీద నుంచి జారి పడి డ్రైన్ లో కొట్టుకు పోయింది అంటూ పాత సంగతులను రేవంత్ గుర్తు చేశారు. టిఆర్ఎస్ పీడ విరగడ కావాలని , కాంగ్రెస్ తరఫున కనీసం 30 మంది కార్పొరేటర్లు గెలిపించాలని ఓటర్లను రేవంత్ కోరారు.  పార్లమెంట్ పరిధిలో తాను మాట్లాడతానని , అలాగే గ్రేటర్ అభివృద్ధి కోసం మాట్లాడేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అందరిని దాటుకుని మరీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ దూసుకు వెళుతుండటంతో, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా సంచలన విమర్శలు చేస్తూ,  గ్రేటర్ కాంగ్రెస్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడంలో ఆయన సక్సెస్ అవుతున్నట్టు గా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: