గ్రేటర్ ఎన్నికల్లో ఇటీవల రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలపై పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. మరోవైపు ఎన్నికల రోజున అల్లర్లు జరిగే అవకాశాలున్నాయన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు బాడీ వార్మ్ కెమెరాలతో నిఘా పెట్టబోతున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మూడు కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. సాధారణంగా ఉండే సీసీ కెమేరాలు, పోలింగ్ బూత్ ‌లలో ఏర్పాటు చేసే వెబ్ కాస్టింగ్ కెమేరాలతో పాటు ఈ సారి 200 బాడీ వార్మింగ్ కెమేరాలను పోలీసులు ఉపయోగిస్తారు.
బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతుండటంతో.. ఎలక్షన్ బూత్‌ లలో గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో బాడీవార్మింగ్ కెమేరాలను పోలీసులు ఉపయోగిస్తున్నారు.

సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు బాడీ వార్మింగ్ కెమేరాలను ఉపయోగిస్తుంటారు. ఎదుటి వ్యక్తి ఘర్షణ పడినప్పుడు ఎవరిది తప్పో ఈ కెమేరాల ద్వారా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో పోలీసులపై తప్పులు నెట్టే అవకాశం ఉండటంతో బాడీవార్మింగ్ కెమేరాలను ఉపయోగించాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది.
హైదరాబాద్‌ లో దాదాపు 200 సున్నిత కేంద్రాలు, అతి సున్నితమైన కేంద్రాలను గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాల్లో ఈ కెమేరాలను ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఎన్నికల రోజే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీల్లో కూడా ఈ కెమేరాలతో నిఘా పెడుతున్నారు. మరోవైపు గతంలో గొడవలు సృష్టించిన వాళ్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన వివరాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు. వీరిపై ప్రత్యేకంగా నిఘా కూడా పెట్టారు. అవసరమైతే వారిని బైండోవర్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సీపీ అంజనీ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి.. హైదరాబాద్ నగరం, ప్రజలు శాశ్వతంగా ఉంటారు, ఎన్నికల ప్రచారానికి చాలామంది వస్తున్నారు, మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే సమాచారం ఉంది, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం’’ అని హెచ్చరించారు అంజనీకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: