న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఢిల్లీ ఛలో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రైతులు-పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గురువారం నుంచి రైతులు ప్రారంభించిన ఢిల్లీ మార్చ్‌‌ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రోడ్డుపై బారీకేడ్లు పెట్టడమే కాకుండా రైతులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్‌లను సైతం ప్రయోగించారు. అయితే రైతులు బారీకేడ్లను పక్కనే ఉన్న నదిలోకి విసిరికొడుతూ పోలీసులతో ఘర్షణకు దిగారు.


 ఈ సంఘటనపై హర్యానా పోలీస్ చీఫ్ మనోజ్ యదన స్పందించారు. రైతులతో తాము ఎలాంటి ఘర్షణలకూ దిగలేదని, వారే తమపై దాడికి పాల్పడ్డారని, అయినా తాము ఎదురు దాడి చేయలేదని, కేవలం వారిని నిలువరించేందుకే ప్రయత్నించామని తెలిపారు.
    

‘మా వాహనాలను రైతులు ధ్వంసం చేశారు. మేం వారిని శాంతింపజేసేందుకే ప్రయత్నించాం. మార్చ్‌ను ఆపే ప్రయత్నం మాత్రమే చేశాం. మేం వారితో ఘర్షణకు దిగలేదు. సిబ్బందితో వారిపై దాడికి దిగలేదు. పరిస్థితులను అదుపు చేస్తూ శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకే ప్రయత్నం చేశాం’ అంటూ మనోజ్ యదన వివరించారు. 


అయితే రైతులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లను ఎందుకు ప్రయోగించారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తమకు సాధ్యమైనంత వరకు శాంతియుతంగా నిలువరించేందుకు ప్రయత్నించామని, అయితే రైతులు దాడికి దిగడంతో చేసేందేం లేక వాటర్ కెనాన్‌లు, టియర్ గ్యాస్ ప్రయోగించామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: