పాతబస్తీలో గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి. పోలీసులు పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఎవరిని గుమిగూడడానికి అనుమతించలేదు. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌ శాంతి భద్రతలను పర్యవేక్షించారు. యాకుత్‌పురా, చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట తదితర శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో పోలింగ్‌ సందర్భంగా అక్కడక్కడా ఎంఐఎం, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.

పాతబస్తీలో పోలింగ్‌ మందకోడిలా సాగింది. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పాతబస్తీలోని సర్కిల్‌-6లో 3.27, సర్కిల్‌-7లో 0.96, సర్కిల్‌-8లో 0.07, సర్కిల్‌-9లో 3.53, సర్కిల్‌-10లో 5.56 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం మూడు గంటల్లో పాతబస్తీలోని నాలుగు నియోజకవర్గాల్లో కేవలం 2 శాతానికి మించి ఓట్లు పోల్‌ కాలేదు. ఈసారి పోలింగ్‌పై వరద సహాయం కింద బాధితులకు అందజేసిన ఆర్థిక సాయం కనిపించింది. వరద సాయం అందలేదు.. మేమెందుకు ఓటు వేయాలంటూ కొందరు ఓట్లు వేయడానికి రాలేదు.

పాతబస్తీలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో చలిని లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్‌ కేం‍ద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయోవృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకొచ్చారు. వృద్దులను కుటుంబ సభ్యులు వాహనాలు, వీల్‌ చైర్లపై పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చారు. పోలింగ్‌ సందర్భంగా ఓటర్, ఆ పోలింగ్‌ ఎజెంట్, డివిజన్‌ పోటీ అభ్యర్థులు, వారికి ఒక్కో ఎజెంట్‌.. ఇలా కేవలం నలుగురిని మాత్రమే ఆయా పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించారు. పోలింగ్‌ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ప్రతిరోజు రద్దీగా ఉండే పాతబస్తీ మంగళవారం బోసిపోయి కనిపించింది

పాతబస్తీలో పోలింగ్‌ ప్రశాంతంగా జరగడానికి దక్షిణ మండలం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద నిఘా పెంచారు. సోమవారం సాయంత్రం నుంచే దక్షిణ మండలంలో సెక్షన్‌-144 కొనసాగుతుండటంతో పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎవరూ నిలబడలేదు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తును మరింత పెంచారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పర్యవేక్షణలో అదనపు బలగాలు శాంతి భద్రతలను పర్యవేక్షించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: