రాజకీయాల్లో అంతే అనుకోవాలేమో. కండువాలు కలరింగులు వేరు కానీ అంతా ఒక్కటే అని అంటారు. ఇది చాలా సార్లు రుజువు అయింది. మళ్లీ మళ్లీ ప్రూవ్ అవుతూ వస్తోంది కొదా. ఇక రాజకీయ చిత్రాలు ఎన్నికల వేళ ఇన్నీ అన్నీ కావు. రాజకీయ  జెండాలు, అజెండాల వెనక ఉన్న అసలు కధలు కూడా వేరుగా ఉంటాయని అంటున్నారు.

విషయానికి వస్తే విశాఖ మేయర్ పీఠాన్ని పట్టాలన్న కసి తో అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ కృషి చేస్తున్నాయి. చావో రేవో అన్నట్లుగా రెండు పార్టీలు పోరుకు సిధ్ధపడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్ల్లో అధికార వైసీపీకి మొగ్గు కనిపించేసరికి ఈసారి ఆ చాన్స్ అసలు ఇవ్వకూడదని టీడీపీ అన్ని ఆయుధాలు సమకూర్చుకుంటోంది.  ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేసిన సంగతి విధితమే. ఆయన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడానికి నిరసనగా తన పదవిని వదులుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఆయన తన రాజీనామాను స్పీకర్ ఫార్మెట్ లో పంపించారు.

అయితే గంటా రాజీనామా జనాలను మభ్యపెట్టడానికే అని బీజేపీ నేత, ఉత్తరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంటున్నారు. గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించరని కూడా ఆయన బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. గంటా స్థానిక ఎన్నికలు అయిపోయిన తరువాత వైసీపీలో చేరిపోతారని కూడా ఆయన జోస్యం చెబుతున్నారు. అందువల్ల విశాఖ ఉత్తరంలో టీడీపీ కార్పోరేటర్ అభ్యర్ధులకు ఓటేస్తే అది వైసీపీకి ఓట్లేసినట్లేనని కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. మరి ఇది నిజమేనా. లేక రాజకీయ విమర్శగా చూడాలా అన్నది మాత్రం అర్ధం కావడంలేదు అని రెండు పార్టీలలోని నాయకులు అంటున్నారు. ఏమో రాజకీయాల్లో ఏమైన జరగవచ్చు అని కూడా అన్నవారు ఉన్నారు. మొత్తానికి రాజు  తన లాజిక్ తో టీడీపీ ఓట్లకు గండి పెడుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: