విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. స్టీల్ ప్లాంట్ కోసం పార్టీలన్ని ఉద్యమిస్తున్నాయి. పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సైతం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామంటూ రోడ్డెక్కింది. ఏపీ బీజేపీ నేతలు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. తీసుకోబోదూ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. పార్టీలన్ని కావాలనే  రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా ప్రధాని మోడీ చేసిన ప్రకటనతో విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ కమలనాధులు చెబుతున్నదంతా అబద్దమేనని తెలుస్తోంది .విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడం ఖాయమని అర్ధమవుతోంది.

 ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు.
వారసత్వంగా వస్తున్నాయనే భావనతో వాటిని నడపలేమని చెప్పారు. వాటిని పరిపుష్టం చేసేందుకు ఆర్థికసాయం చేయడం పెనుభారంతో కూడుకున్నదని అన్నారు.డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, అవి ప్రజల ధనంతో నడుస్తున్నాయని చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం వైదొలగే రంగాలను ప్రవేటు రంగం భర్తీ చేస్తుందని మోడీ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరని అన్నారు. వ్యాపార రంగానికి కేంద్ర ప్రభుత్వం తమవంతు తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదని అన్నారు.  ప్రధాని మోడీ ప్రకటనతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం ఖాయమైనట్టే.ఏపీ బీజేపీ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి మరీ..


మరింత సమాచారం తెలుసుకోండి: