పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. పురపోరు ప్రారంభమైంది. వచ్చే నెల్లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పంచాయతీ పోరులో పై చేయి సాధించిన వైసీపీ.. పనిలోపనిగా పురపాలకాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. పుర పోరుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నగారా మోగించారు. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల ఉపసంహరణల నుంచి ప్రారంభం కానుంది. ఇక విజయనగరం విషయానికి వస్తే.. ఇక్కడి కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా వైసీపీ నుంచి 112 మంది నామినేషన్లు వేశారు. పార్వతీపురంలో 30వార్డులున్నాయి. ఇక్కడ  87 మంది నామినేషన్లు వేశారు. బొబ్బిలిలో 31వార్డులకు 84 మంది.. సాలూరులో 29 వార్డులకు 87 మంది నామినేషన్లు వేశారు. నెల్లిమర్లలో 20 వార్డులకు ఏకంగా 56 మంది వైసీపీ తరఫున నామినేషన్లు వేశారు.

విజయనగరానికి కార్పొరేషన్‌ హోదా వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. తొలిసారి మేయర్‌ పీఠం.. ఈ అవకాశం  ఎలాగైనా దక్కించుకోవాలి. ఇదీ  విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని పార్టీల ప్రయత్నం. అయితే.. ప్రతిపక్ష టీడీపీ నేతలు ఓ అడుగు ముందుకేశారు. ఎలాగైనా గెలిచితీరాలన్న పట్టుదలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అదే సమయంలో  ప్రలోభాలకు తెరతీశారు. విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలోని 31వ డివిజన్‌ బీసీ కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ సమీపంలో స్థానిక యువతకు ఇటీవల టీడీపీ అభ్యర్థి కంది మురళీనాయుడు క్రికెట్‌ కిట్లు పంపిణీ చేశారు.

ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతలను హడలెత్తిస్తోంది. ఓ వైపు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా టీడీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు.. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిపై అధికార పక్షం విమర్శలు గుప్పిస్తోంది. ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది. ఇలాంటి ప్రలోభాలు తెరపైకి రానంత కాలం బాగానే ఉంటుంది. కానీ.. ఫోటోలు,వీడియోలు బయటకు వస్తే అభ్యర్థులకు ఇబ్బందే. ఇప్పుడు ఇదే స్థానిక టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: