మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగిసింది. పోరుకు అన్ని పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు సిద్ధమయ్యారు. పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువుంది. అనంతపురం జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు వేడి చూస్తుంటే ఆసక్తికరంగా మారాయి. పోలింగ్‌ కు తక్కువ సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవటంలో అభ్యర్థులు బిజీగా బిజీగా మారిపోయారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు తాము పోటీ చేస్తున్న డివిజన్లు, వార్డులలో పర్యటించిన అభ్యర్థులు మళ్ళీ మళ్ళీ పర్యటనకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 

అనంత జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌, హిందూపురం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుత్తి మున్సిపాలిటీలు, పుట్టపర్తి, మడకశిర నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుంతకల్లులో మూడు, తాడిపత్రిలో రెండు, ధర్మవరంలో 10, గుత్తిలో ఆరు వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఉన్న లెక్కల ప్రకారం చూస్తే అధికార పార్టీకి ప్రతిపక్షాల వారి కంటే ఇండిపెండెంట్ అభ్యర్ధుల నుంచి ముప్పు ఎదురుకానుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. అదేమంటే అధికార పార్టీ తరపున బీ-ఫాం ఆశించి భంగపడిన ఎక్కువమంది రెబల్స్‌ స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీలో ఉండటమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సయోధ్యలు, బెదిరింపులు పనిచేయకపోవడంతో ఆ అభ్యర్థులు అలాగే పోటీలో ఉండటం కొందరు వైసీపీ అభ్యర్థులను కలవరపెడుతోంది. ప్రధానంగా వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ ఉన్న నేపథ్యంలో బలమైన స్వతంత్ర అభ్యర్థులు తమ ఓట్లను చీల్చి తమ ఓటమికి కారణం అవుతారేమో లో కీలకమవుతారనే చర్చ సాగుతోంది. ఉదాహరణకు అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలో 50 డివిజన్లకు 204 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అందులో 62 మంది ఇండిపెండెంట్లే కావడం గమనార్హం. హిందూపురంలో సైతం 38 వార్డులకు గాను 160 మంది అభ్యర్థులుండగా అందులో 54 మంది ఇండిపెండెంట్లే . కదిరిలో 36 వార్డులకు 144 మంది బరిలో నిలవగా.. ఇందులో 44 మంది ఇండిపెండెంట్లే. తాడిపత్రిలో 30 మంది, గుంతకల్లులో 29 మంది ఇండిపెండెంట్ లు బరిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: