కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జర్కిహొళి రాస‌లీల‌ల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఫిర్యాదుదారు, సామాజిక కార్యకర్త దినేశ్ కలహళి తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం క‌లుగుతుంద‌ని భావించిన దినేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబందించిన లేఖను తన న్యాయవాది కుమార్‌పాటిల్ ద్వారా కబ్బన్ పార్క్ పోలీసుల‌కు పంపించారు.  స్టేషన్ పోలీసు అధికారిని కలిసి లేఖను అందించాన‌ని, జర్కిహొళిపై దినేశ్  చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నామ‌ని చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

ఎటువంటి రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి ఫిర్యాదు ఉప‌సంహ‌ర‌ణ లేఖ‌ను అంద‌జేయలేద‌ని, తన క్లయింటు దినేశ్ ఎటువంటి  ఒత్తిళ్ళకు లొంగబోరని, ఆయన సామాజిక కార్యకర్త అని, ప్రజల హక్కుల కోసం పోరాడే దక్షత క‌లవారని కుమార్ అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చేయడమే దినేశ్ ఆశయమన్నారు. సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని, ఇది మరింత తీవ్రమ‌వ‌కుండా నిరోధించేందుకు ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్న‌ట్లు తెలిపారు. అవసరమైతే దినేశ్ స్వయంగా పోలీసులను కలిసి ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా చెబుతారని, ఈ కేసులో పోలీసులకు అవసరమైన సమాచారాన్ని ఆయ‌న అందజేస్తారని చెప్పారు.

ఉద్యోగం కోసం త‌న‌ను ఆశ్ర‌యించిన ఓ మ‌హిళ‌తో అప్ప‌టి క‌ర్ణాట‌క జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి ర‌మేశ్ జ‌ర్కిహొళి అసభ్యకర రీతిలో ఉన్న‌టువంటి సీడీని దినేశ్ మీడియాకు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. బాధితురాలిని లొంగ‌దీసుకొని ఆమెతో రాస‌లీల‌లు న‌డిపిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వ‌డంతోపాటు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో జర్కిహొళి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. క‌ర్ణాట‌క‌లో య‌డ్యూర‌ప్ప నేతృత్వంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టానికి కార‌కులైన‌వారిలో ర‌మేశ్ కూడా ఒక‌రు. పార్టీ ప‌రంగా ఆయ‌న‌పై ఇంత‌వ‌ర‌కు ఒక్క చ‌ర్య కూడా తీసుకోలేదు. అంతేకాకుండా తాజాగా దినేశ్ త‌న ఫిర్యాదును కూడా ఉప‌సంహ‌రించుకున్నారు. పైకి ఏమీ చెప్ప‌క‌పో్యిన‌ప్ప‌టికీ అంత‌ర్గ‌తంగా రాజ‌కీయ ఒత్తిళ్లు ప‌నిచేసిన‌ట్లు తేట‌తెల్ల‌మ‌వుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: