రాజకీయ నాయకులు అన్న తరువాత చాలా జాగ్రత్తగా మాటలు ఉండాలి. ఒక్క మాట తప్పుగా వచ్చినా లేక అలా అర్ధం వచ్చినట్లుగా అనిపించినా అది అతి పెద్ద వివాదమే అవుతుంది. దాంతో చాలా పరిణామాలే వేగంగా జరిగిపోతాయి.

ఇపుడు చూస్తే అలాంటి పరిస్థితే దేశానికి హోం మంత్రి, ప్రధాని మోడీ తరువాత అంతటి వాడు అయిన అమిత్ షా ఎదుర్కొంటున్నారు అన్న ప్రచారం సాగుతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్న సంగతి విధితమే. ఈ నేపధ్యంలో అటూ ఇటూ మాటలు తూటలు మాదిరిగా పేలుతున్నాయి. తాజాగా పశ్చిమ‌ బెంగాల్ టూర్ లో అమిత్ షా చేసిన కొన్ని కామెంట్స్ మిత్ర దేశం బంగ్లాదేశ్ నొచ్చుకునేలా ఉన్నాయని అంటున్నారు.

బంగ్లాదేశ్ నుంచి ఆకలితో జనాలు భారత్ ని వలస వస్తున్నారు అని వారి వలసలను అడ్డుకుంటామని అమిత్ షా  చేసినట్లుగా చెప్పబడుతున్న‌ ఈ కామెంట్ మీద మిత్ర దేశం బంగ్లా దేశ్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. మేము పేద దేశం కాదు, ఆకలి దేశం అంతకంటే కాదు మా ఆర్ధిక వ్యవస్థ భారత్ కంటే కూడా చాలా మెరుగ్గా ఉంది. ఇక బంగ్లా దేశ్ కి వచ్చి లక్షలాది భారతీయులు ఉద్యోగాలు కూడా చేసుకుటున్నారు అంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి గట్టిగానే కౌంటర్ ఇచ్చేశారు.

మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కాదు కానీ సరిహద్దుల్లో ఉన్న పొరుగు దేశంతో విభేధాలు వచ్చేలా కధ అడ్డం తిరిగింది అన్న మాట అయితే వినిపిస్తోంది. ఇప్పటికే మోడీ బంగ్లాదేశ్ కి వెళ్ళి ఆ దేశ అవతరణ దినోత్సవాల్లో పాలుపంచుకున్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కావడానికి భారత్ కారణం. ఆ విశ్వాసం బంగ్లాదేశ్ కి ఎపుడూ ఉంది. పైగా రెండు దేశాలూ కూడా చక్కగా మెలగుతున్నాయి. ఈ సమయంలో అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరాదు అన్న మాట మేధావి దౌత్య వర్గాల నుంచి వస్తోంది. మరి దీన్ని ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: