ప్రజా స్వామ్యంలో ప్రతిపక్షాలకు ఎంతో విలువైన పాత్ర ఉంటుంది. అవి ప్రజా సమస్యలను ఎప్పటికపుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారానికి చూస్తాయి. తామే స్వయంగా జనాల్లోకి వెళ్ళి సమస్యలను గుర్తించి మరీ ప్రభుత్వానికి వాటి గురించి చెబుతాయి.

కానీ వర్తమాన రాజకీయాలలో  చూస్తే అలాంటివి ఏవీ కనిపించడంలేదు. ఏ డైలాగ్ కొడితే ఎంత మైలేజ్ వస్తుంది. ఏ టాపిక్ మీద ఫోకస్ పెడితే మీడియా అటెన్షన్ ఉంటుంది ఇలా ఆలోచించే వారు ఇపుడు కనిపిస్తున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో ప్రజా సమస్యలు లేవా అన్న చర్చ కూడా వస్తోంది. ఏ సమస్య లేకపోతేనే  కరోనా రోగులు, వ్యాక్సిన్ల కొరత, కేసులు గుర్తుకు వస్తాయా అన్న సెటైర్లు కూడా విపక్షం మీద పడుతున్నాయి.

ఏపీలో ఆ మధ్య దాకా టెన్త్ ఇంటర్ పరీక్ష రద్దు అంటూ యాగీ చేశారు. అవి వాయిదా పడ్డాక వ్యాక్సిన్లు అంటూ అందుకున్నారు. కరోనా కేసులు పెరిగిపోతున్నాయని చెప్పుకొచ్చారు.  ఇపుడు కూడా ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కానీ సడెన్ గా వాటిని గాలికి వదిలేసి రఘురామ క్రిష్ణం రాజు సమస్య మీదనే విపక్షాలు దృష్టి పెడుతున్నాయి. నిజానికి ఆయన అరెస్ట్ అక్రమం అయితే కోర్టులు చూసుకుంటాయి. ఆయనను చట్ట ప్రకారం అరెస్ట్ చేశామని సీఐడీ చెబుతోంది.

దాని మీదనే రోజుల తరబడి విపక్షాలు తమ శక్తియుక్తులు అన్నీ కూడా పెట్టడం అంటే అది రాజకీయం తప్ప మరోటి కాదని కూడా అర్ధమవుతోందని అంటున్నారు. ఏపీలో విపక్షాలకు సబ్జెక్టులు లేవా అన్న ప్రశ్న కూడా వస్తోందిట. గత ఏడాది మత్తు డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో ఇలాగే అందరూ కలసి రచ్చ చేశారు. ఇపుడు కూడా ఒక్కటే టాపిక్ మాట్లాడుతున్నారు. ఇక్కడ చిత్రమేంటి అంటే రఘురామ రాజు వైసీపీ ఎంపీ, ఆయనకు పార్టీకి మధ్య గొడవలు ఉంటే వారూ వారూ చూసుకుంటారు. అన్యాయమే జరిగితే కోర్టులు ఉన్నాయి. మరి విపక్షాలకు ఎందుకీ అతి ఉత్సాహమో అర్ధం కావడంలేదనే అంతా అంటున్నారు. ఏపీలో ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే జనాల మద్దతు దక్కుతుంది కానీ ఇలాంటి రాజకీయలతో జనాలను తిప్పుకోలేరని అంటున్నారు. మరి ఏపీలో విపక్షాలు గాలివాటంగా ఏది పడితే దాని మీదనే ఫోకస్ పెడుతున్నాయన్న విమర్శలు అయితే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: