కార్మిక సిరిసిల్ల, ధార్మిక వేములవాడ జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, నాఫ్కాబ్‌ ఛైర్మన్ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ చైర్మన్ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ శాఖల పరిధిలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, తదితర అంశాలపై మంత్రి కూలంకషంగా చర్చించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మత్తులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులు, పంచాయితీ రాజ్ శాఖ అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్ పూర్ బ్రిడ్జి కి నిధులు మంజూరు చేయడం జరిగిందని, నిర్మాణ ప్రగతిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. హన్మాజిపేట గ్రామంలో బ్రిడ్జి నిర్మించేలా ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని అన్నారు. వేములవాడలో ప్రగతిలో ఉన్న రెండో బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడలోని తిప్పాపూర్ జంక్షన్ ను అభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు, మధ్య మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్‌ల ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను నింపాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలోని 665 చెరువులు వంద శాతం నింపేలా చర్యలు నీటి పారుదలశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అందులో 165 చెరువులు పూర్తిస్థాయిలో ఇప్పటికే నింపడం పూర్తయిందని నీటి పారుదల శాఖ అధికారులు మంత్రికి వివరించారు. ప్రతి మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని నిండాయి అని క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని చెరువులు నింపేలా చూడాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

జిల్లాలో ప్రగతిలో ఉన్న 24 చెక్ డ్యాంల నిర్మాణాలను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కూడా మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. అందులో 9 చెక్ డ్యాంల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని మంత్రికి అధికారులు వివరించారు. మిగిలిన 15 చెక్ డ్యాంలను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, అదనంగా అవసరం ఉన్నచోట చెక్ డ్యాంలు నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి సూచించారు.

సిరిసిల్ల, వేములవాడ పట్టణాలలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి, అదనంగా అవసరమైన భూ సేకరణ చేసి మోడల్ కాలనీని నిర్మించేలా చూడాలని  మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా మున్సిపల్ అధికారులు పని చేయాలని అన్నారు. ధార్మిక, కార్మిక క్షేత్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అన్ని విభాగాల అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆదేశించారు. తద్వారా భవిష్యత్‌లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: