వైసీపీ హయాంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్ సర్కారు వారికి శుభవార్తలు వినిపించింది. హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చిన సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏను మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 తేదీ నుంచి ఏడాది పాటు ఈ హెచ్ఆర్ఏ పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 
రాష్ట్ర విభజన తర్వాత.. హైదరాబాద్ నుంచి తరలివచ్చి విజయవాడ, గుంటూరులలో అద్దె ప్రాతిపదికన నివాసం ఉంటున్న ఉద్యోగులకు ఈ 30 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తుంది. ఈ మేరకు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. హైదరాబాద్ నుంచి తరలిరాని ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. అలాగే.. నూతనంగా ఉద్యోగాల్లోకి చేరిన వారికి, డెప్యుటేషన్ పై వచ్చిన వారికీ ఇంటి అద్దె భత్యం ఉత్తర్వులు వర్తించవు.


అంతే కాదు.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం మేర  కరవు భత్యాన్ని పెంచుతూ కూడా జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. మూలవేతనంపై 30.392 శాతం నుంచి 33.536 శాతానికి డీఏ పెంచుతున్నట్టు  ప్రభుత్వం తెలిపింది. 2019 జనవరి 1 తేదీ నుంచి కరవు భత్యం పెంపుదల ఉత్తర్వులు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా, మండల పరిషత్ లు, గ్రామ పంచాయితీలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బందికీ డీఏ పెంపుదల వర్తిస్తుంది.


ఇంకా.. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, జ్యూడీషియల్ ఆఫీసర్లకు 148 నుంచి 154 శాతం మేర డీఏను పెంచినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021 జూలై నెల వేతనంతో పెంచిన కరవు భత్యాన్ని నగదు  రూపంలో చెల్లిస్తారు. 2019 జనవరి 1 తేదీ నుంచి డీఎ బకాయిలును సమాన వాయిదాల్లో జూలై 2021 జూలై నుంచి చెల్లిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: