ఒక కుటుంబం, లేదా వర్గం, లేదా సమూహం ఒక్క మాటపై ఉంటేనే ఏదైనా డిమాండ్‌ సాధించుకోవాలన్నా, సమస్య పరిష్కరించుకోవాలన్నా అది సాధ్యం అవుతుంది. తెలంగాణ వాదులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం సాగించడం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయింది. ఆనాడు భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ దేశప్రజలంతా ఐకమత్యంతో మెలగడం వల్లే బ్రిటీష్‌ వాళ్లు తలొగ్గారు. బానిస సంకెళ్ల నుంచి దేశం విముక్తి పొందింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ఇండస్ట్రీ పెద్దలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీకి చెందినవారిలోనే.. అధికార వైసీపీకి ఒత్తాసు పలుకుతూ ఒకరు, ఆ పార్టీకి వ్యతిరేకంగా మరొకరు, పాము చావ కూడదు.. కట్టె విరగ్గొడదు అనేలా ఇంకొకరు.. ఇలా రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ వర్గాల్లో గందరగోళం నెలకొంది.

హైదరాబాద్‌లో శనివారం జరిగిన రిపబ్లిక్‌ సినిమా ప్రిరీలీజ్‌ వేడుకలో జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినీ పరిశ్రమకు సంబంధించిన ఆన్‌లైన్‌ టిక్కెట్ల అమ్మకాల్లో ప్రభుత్వ పెత్తనం ఏమిటి? అని జగన్‌ సర్కారుని ఆయన ప్రశ్నించారు. అప్పుల కోసమే సినిమా డబ్బులు కావాల్సి వచ్చాయా? ఆ ఆదాయాన్ని చూపి మరిన్ని రుణాలు పొందడమేనా ప్రభుత్వ ఉద్దేశ్యం? అని నిలదీశారు. అసలు ప్రైవేట్‌ వ్యక్తులు రూపొందించే సినిమాలపై ప్రభుత్వ ఆధిపత్యం ఏమిటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌ ఇలా మాట్లాడటం.. సినీ పరిశ్రమ వర్గాలను ఆలోచనలో పడేశాయి.

ఆన్‌లైన్‌ టిక్కెట్‌ విధానంపై ఈనెల 20వ తేదీన విజయవాడలో మంత్రి పేర్ని నాని నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరైన సినీ నిర్మాత సి.కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలే కారణం. ఆన్‌లైన్‌ టిక్కెట్‌ విధానాన్ని తామే అడిగామని నిర్మాత సి.కల్యాణ్‌ అప్పుడు చెప్పారు. ఇప్పుడు సినీ పరిశ్రమలో అగ్రహీరోగా వెలుగొందుతున్న పవన్‌ కల్యాణ్‌ ఆన్‌లైన్‌ టిక్కెట్‌ విధానంపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. అంతకుముందు మెగా స్టార్‌ చిరంజీవి కూడా.. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సుతిమెత్తగా కోరారు. ఇప్పుడు ఆయన తమ్ముడు, పవర్‌ స్టార్‌ కల్యాణ్‌ మాత్రం ఘాటుగా మాట్లాడారు. వీరిద్దరికి భిన్నంగా సినీ నిర్మాత సి.కల్యాణ్‌ ప్రభుత్వానికి ఒత్తాసు పలికేలా మాట్లాడారు. ఇలా సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుండటంతో.. ఇండస్ట్రీ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయన్న ఆందోళన సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి.. మాట్లాడితేనే సినీ పరిశ్రమకు ఏదైనా ప్రయోజనం ఉంటుందన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ దిశగా సినీ ప్రముఖులు అడుగులు వేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: