హైదరాబాద్‌లో శబ్ద కాలుష్యం మోత మోగుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రికార్డు స్థాయిలో సౌండ్‌ పొల్యూషన్‌ నమోదవుతోంది. ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే పగలు కాకుండా... రాత్రి వేళల్లో కూడా శబ్ద కాలుష్యం అధికంగా నమోదు అవుతున్నట్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో వెల్లడి అయింది. సున్నిత ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా శబ్ద కాలుష్యాన్ని ప్రాంతాలవారీగా లెక్కిస్తారు. వాణిజ్య, నివాసిత, పారిశ్రామిక, సున్నిత ప్రాంతాలుగా సిటీని వర్గీకరించారు. సీపీసీబీ నిర్దేశిత పరిమితులు ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. జూబ్లీహిల్స్‌, తార్నాకలను నివాస ప్రాంతాలుగా.. అబిడ్స్‌, జేఎన్టీయూ, ప్యారడైజ్‌లను వాణిజ్య ప్రాంతాలుగా.. సనత్‌నగర్‌, జీడిమెట్లను పారిశ్రామిక ప్రాంతాలుగా.. జూపార్క్‌, గచ్చిబౌలిలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించి శబ్ద తీవ్రతను నమోదు చేస్తున్నారు. సీపీసీబీ నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగలు 55 డెసిబుల్స్‌, రాత్రి 45 డెసిబుల్స్ శబ్ద తీవ్రత పరిమితికి ఉంది. అలాగే వాణిజ్య ప్రాంతాల్లో పగలు 65, రాత్రి 55 డెసిబుల్స్‌గా ఉంది. అదే పారిశ్రామిక ప్రాంతాల్లో పగలు 75, రాత్రి 70 డెసిబుల్స్ ఉండాలి. సున్నిత ప్రాంతాల్లో పగలు 50, రాత్రి 40 డెసిబుల్స్ ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే నగరంలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

సున్నిత ప్రాంతాలైన జూపార్క్‌, గచ్చిబౌలిలో రాత్రిపూట పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. నిర్దేశిత పరిమితుల కంటే జూపార్క్‌లో పగలు 8, రాత్రి 19 డెసిబుల్స్‌ అధికంగా శబ్ద తీవ్రత నమోదు అయింది. గచ్చిబౌలిలో పగటిపూట 9, రాత్రిపూట 15 డెసిబుల్స్‌ చొప్పున ఎక్కువగా నమోదు అయినట్లు తేలింది. నివాస ప్రాంతాలైన జూబ్లీహిల్స్‌లో పగలు 3, రాత్రి 12, తార్నాకలో పగలు 6, రాత్రి 13 డెసిబుల్స్‌ చొప్పున అధికంగా ఉండటం గమనార్హం. వాణిజ్య ప్రాంతాల్లోనూ పగలు 4, రాత్రి 11-15 డెసిబుల్స్‌ చొప్పున ఎక్కువగా నమోదైంది. పారిశ్రామిక ప్రాంతాల్లో నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగానే నమోదు అవుతోంది. కాకుంటే.. జీడిమెట్లలో పగలు కంటే రాత్రి పూటే అధికంగా శబ్ద తీవ్రత ఉంటోంది.

అయితే వాహన రద్దీ ఎక్కువగా ఉండే పగలు కాకుండా రాత్రి ఎక్కువ శబ్ద తీవ్రత నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి సరకుల్ని మోసుకొచ్చే భారీ వాహనాలు, ట్రావెల్స్‌ బస్సుల రాకపోకలు రాత్రిపూటే ఎక్కువగా ఉంటాయి. వీటి హారన్ల మోతతోనే శబ్ద కాలుష్యం ఎక్కువగా నమోదు అవుతున్నట్లు పీసీబీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నిర్మాణ పనులు కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే శబ్ద కాలుష్యం చిరాకు, ఆందోళనకు కారణమవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత లోపించి రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణంలో ఎక్కువసేపు ఉంటే రక్తపోటు పెరగడం, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: