టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయం మొత్తం తిరుగుతోంది. అసెంబ్లీలో తనకుటుంబ సభ్యులపైన, అధికార పార్టీ నేతలు ఎప్పుడైతే విమర్శలు చేస్తున్నారని చెప్పారో.. అప్పటినుంచి మీడియా ఫోకస్ మొత్తం చంద్రబాబు పైనే ఉంది. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవటం మరింత హైలైట్ అయింది. దీంతో మీడియా కూడా బాబు ఏడుపు ఎపిసోడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టేసింది. అయితే చంద్రబాబు ఏడవడంతో కొందరు ఆయనకు మద్దతుగా నిలిచారు. మరికొందరు చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందంటూ ప్రకటనలు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు తాజాగా కాపు సంఘాల నేతలు కూడా చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్ పై స్పందించారు.

అధికారంలో ఉండగా చంద్రబాబు చేసిన పనుల వలనే ఇప్పుడు ఇలా ఏడవాల్సి వస్తోందని కాపు సంఘాల నేతలు చెబుతున్నారు. కాపు రిజర్వేషన్ పునరుద్ధరణ వేదిక పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో కాపుల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు ఇబ్బంది పెట్టారని అన్నారు. ఇప్పటికైనా ముద్రగడకు క్షమాపణ చెప్పాలని కాపు రిజర్వేషన్ పునరుద్ధరణ ఉద్యమ వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాపులను రాజకీయంగా ఎదగనీయలేదని, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి.. అల్లరి చేసిన విషయాన్ని కాపు సమాజం మర్చిపోదని అన్నారు.

కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో కాపు సంఘాల నేతలు ఎన్ని కష్టాలు అనుభవించారో గుర్తుందనీ , అందుకు కారణం కూడా చంద్రబాబేనని చెప్పుకొచ్చారు. అప్పుడు చంద్రబాబు చేసిన పనులకు, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారంటూ చెప్పారు. తాజాగా చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో ఇవన్నీ ప్రస్తావించారు కాపు రిజర్వేషన్ పునరుద్దరణ ఉద్యమ వేదిక సభ్యులు. చంద్రబాబుకు ఇవన్నీ రిటర్న్ గిఫ్టులు మాత్రమేనని, చేసిన ఖర్మకు ఫలితం కచ్చితంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. మొత్తాన్ని ఈ ఎపిసోడ్ తో మరోసారి చంద్రబాబు కాపురాజకీయం అనే ప్రస్తావన వచ్చింది. ముద్రగడ ఎపిసోడ్ ని అడ్డు పెట్టుకుని కొంతమంది కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదా కాపుల్లో మొత్తం చంద్రబాబుపై వ్యతిరేకతతో ఉన్నారా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: