ఇదివరకే పెన్షన్లు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా తాజాగా దానికి సంబంధించిన జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ ను 2వేల 250రూపాయల నుంచి 2వేల 500రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు డిసెంబర్ 2021 నుంచి వర్తిస్తుందని.. జనవరి 1, 2022న పెరిగిన మొత్తంతో పెన్షన్ చెల్లించనున్నట్టు తెలిపింది. దీనివల్ల ప్రభుత్వంపై 129కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొంది.
జనవరి 1 నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని.. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జనవరి నెలలో మొత్తం 61.75లక్షల మంది పెన్షన్లు ఇస్తామన్న పెద్దిరెడ్డి.. ఇందుకోసం 15వందల 70కోట్లు విడుదల చేశామన్నారు.
మరోవైపు అర్హులుగా ఉండి సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా చేయూత అందించింది. 18.48లక్షల మంది అకౌంట్లలో పథకాలకు సంబంధించి 703కోట్ల రూపాయలను జమ చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేశారు. ఇకపై అర్హులుగా ఉండి.. ఏదైనా కారణంతో సంక్షేమ పథకాలు అందని వారికి ఏటా జూన్, డిసెంబర్ లో లబ్ధి చేకూరుస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇక పట్టణ ప్రాంతంలోని నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభం కానుంది. జనవరి 7వ తేదీ నుంచి నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. అన్ని వసతులతో సిద్ధంగా ఉన్న ఇళ్లను వీలైనంత వేగంగా లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో ప్రక్రియ పూర్తయిన వెంటనే మిగతా జిల్లాల్లో ప్రారంభించనున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి