రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణలోనూ నైట్ కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేయాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. అలాగే థియేటర్లు, మాల్స్, ఇతర జనం గుమిగూడే ప్రదేశాల్లో ఆంక్షలు అమలు చేయాలని భావిస్తోంది. ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రి మండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఆదిలా బాద్ జిల్లా చెన్నూరులో కండక్టర్ కు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. హన్మకొండ-చెన్నూరు ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కండక్టర్.. ప్రయాణీకులు దిగాక డ్రైవర్ తో కలిసి టీ తాగారు. ఆ దగ్గర్లోనే ఉన్న కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రం చూసి.. ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలగా.. ప్రయాణీకులు, ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

ఇక తెలంగాణలో 5కోట్ల కరోనా డోసుల పంపిణీ పూర్తైనట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజల స్ఫూర్తి, వైద్య సిబ్బంది అంకిత భావం వల్లే ఈ ఘనత సాధించామన్నా ఆయన.. అనేక ఆటంకాలు దాటి ఈ స్థాయికి చేరుకున్నట్టు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రయాణాన్ని ఇలానే కొనసాగిద్దామన్న హరీశ్.. 15నుంచి 18ఏళ్ల మధ్య వయసు వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్ లో విధిలు నిర్వహిస్తున్న ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు 14మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పోలీస్ స్టేషన్ కు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. ఫిర్యాదు దారుడు ఒక్కరు మాత్రమే రావాలని ఆంక్షలు విధించారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలకు ఈ నెల 30వరకూ సెలవులు పొడిగిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ సీఎస్ ప్రకటించారు. మొదట విద్యా సంస్థలకు ఈ నెల 8 నుంచి 16వరకే సెలవులు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: