- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

డోన్ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రస్తుతం సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పాత్ర పరిమితంగా ఉంద‌న్న చ‌ర్చ ఇప్పుడురాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై విజయాన్ని సాధించిన కోట్ల ఇప్పుడు పార్టీ పాలన విధానాలపై అసంతృప్తిగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తన మాటకు విలువ లేకపోతుందన్న భావనతో కోట్ల తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేతగా, డోన్ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా బలమైన వ‌ర్గంతో ఉన్న కోట్ల ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆ పట్టు కోల్పోతున్నారన్న భావన పార్టీలోనే కనిపిస్తోంది. మంత్రివర్గంలో చోటు ద‌క్క‌క‌పోవ‌డం, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం రాకపోవడం కూడా ఆయన అసంతృప్తికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.


ప్రస్తుతం మంత్రివర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో, అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు పదవిని ఇవ్వడం సాధ్యపడదన్న విషయం చంద్రబాబు ఇప్పటికే కోట్లకు వివరించినప్పటికీ, ఆయన అసంతృప్తి తీరలేదు. పార్టీ వర్గాల్లో, వచ్చే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో కొత్త వ్యక్తికి అవకాశమిస్తారన్న చర్చలు జరుగుతుండడంతో, ఆయన రాజకీయ భవితవ్యంపై మరింత అనిశ్చితి ఏర్పడింది. సుపరిపాలనలో తొలి అడుగు వ్యవహరించటం, స్థానిక అధికారులంతా ఆయన మాటకు ప్రాధాన్యత ఇవ్వడం కోట్లకు మింగుడుపడడం లేదు.
తాజాగా సుప‌రిపాల‌న‌కు తొలి అడుగు కార్య‌క్ర‌మంతో పాటు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా ఆయనకు ప్రాధాన్యం లేకపోవడం, తాను నమ్ముకున్న కేడర్ బలహీనపడిపోతుందన్న ఆందోళనతో కోట్ల ఉన్నారు.


ఇది చూసిన వారు వచ్చే ఎన్నికల్లో కోట్ల పోటీకి దూరంగా ఉండొచ్చన్న అభిప్రాయానికి వచ్చారు. టీడీపీ అధిష్టానం కూడా యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మార్పులు, కొత్త మార్గదర్శకాలు కోట్లను పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా ఉంచుతున్నాయి. ఫైన‌ల్‌గా డోన్ రాజకీయాల్లో గతంలో కనిపించిన దూకుడు, తడాఖా ప్రస్తుతం కనిపించకపోవడం, కోట్ల పాత్ర క్ర‌మంగా తగ్గిపోతుండడం స్థానికంగా గమనించదగిన అంశం. గతంలో ఈ ప్రాంత రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కోట్ల ఇప్పుడు సైడ్ లైన్ అవుతుండ‌డం ఆయ‌న అనుచ‌రుల్లో కూడా ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితుల్లో కోట్ల మళ్లీ రాజకీయంగా పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా మారతారా? లేక రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అనే ప్రశ్నకు కాల‌మే స‌మాధానం చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: