ఎంతో మంది జన్మించగానే ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కానీ వారి జీవితం ప్రయాణంలో ఎంతమంది ఆ లక్ష్యాలను అందుకుంటారనేది సమాధానం లేని ప్రశ్న. ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా మారిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఒక సామాన్య మహిళ అయినటువంటి లవ్లీనా ప్రస్తుతం జపాన్-టోక్యో వేదికగా జరుగుతున్న 2020 ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశం తరపున మహిళల బాక్సింగ్ విభాగంలో పోటీ పడి పతకాన్ని సాధించే దిశగా దూసుకుపోతోంది. మరి ఈ లవ్లీనా ఈ స్థాయికి ఎదగడానికి ఆమెకు దారి తీసిన పరిస్థితులు మరియు విజయ మార్గం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా పూర్తి పేరు లవ్లీనా బోర్గా హైయిన్. ఈమె 1997 సంవత్సరంలో గోలఘట్ జిల్లాలో జన్మించింది. ఈమె తండ్రి టైకన్ ఒక చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. కానీ ఈమె చిన్నప్పటి నుండి బాక్సర్ కావాలని ఎన్నో కలలు కనింది. ఆమె ఆశయాన్ని అర్థం చేసుకున్న తండ్రి ఎలాగైనా ఈమెను ఒక అద్భుతమైన బాక్సర్ గా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఎన్ని కష్టాలను అనుభవించిన కూతురుని ఒక బాక్సర్ ని చేయాలనే విషయాన్ని ఆ తండ్రి మరువలేదు. అది 2012 వ సంవత్సరం ఘోలఘట్ జిల్లాలోని హై స్కూల్ స్థాయిలో బాక్సింగ్ సెలక్షన్ జరుగుతున్నాయి. ఈ సెలెక్షన్స్ లో పాల్గొన్న లవ్లీనా ప్రదర్శనకు మెచ్చిన ప్రముఖ బాక్సింగ్ కోచ్ పదుమ్ బోరో లవ్లీనాను స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియాకు ఎంపిక చేశారు. ఈ అవకాశాన్ని లవ్లీనా రెండు చేతులతో అందిపుచ్చుకుంది.
స్పోర్ట్స్ అథారిటీ ఇండియా శిక్షణలో మరింత రాటుదేలి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అంచెలంచెలుగా బాక్సింగ్ లో ఉత్తమ స్థాయిలో నిలిచింది. ఈ కృషి పట్టుదలే ఆమెను ఒలింపిక్ గేమ్స్ 2020 కు సెలెక్ట్ అయ్యేలా చేసింది. ఇలా లవ్లీనా అస్సాం నుండి టోక్యో వరకు వెళ్లడంలో తన శ్రమ, పట్టుదల, అకుంఠిత దీక్ష తనను భారతదేశం గర్వించేలా చేయడంలో నిలబెట్టాయని చెప్పవచ్చు. ఈమె చైనీస్ తైపీకి చెందిన నీ చెన్ చెన్ ను 4-1 స్కోర్ తో చిత్తు చేసి సెమీఫైనల్ కు చేరుకొని భారత్ కు రెండవ పతకాన్ని ఖాయం చేసింది. ఈమెను చూసి ప్రస్తుతం భారతీయులంతా గర్వంగా ఫీలవుతున్నారు. కొడితే గోల్డ్ మెడల్ కొట్టాలని కోరుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: