రోజులు గడుస్తున్నాయి తప్ప అటు దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి మాత్రం ఎక్కడా మారడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప రైతులు ఆత్మహత్యలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా రైతే రాజు మాకు రైతుల శ్రేయస్సే ముఖ్యం అంటూ చెబుతున్నాయి.  రైతులందరూ మాకు మంచి రోజులు రాబోతున్నాయి అంటూ సంతోష పడిపోతున్నారు. కానీ ఒక వైపు నుంచి ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. మరో వైపు నుంచి ప్రకృతి పగ పట్టడంతో అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.


 చివరికి కుటుంబ పోషణ కూడా చూసుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా లో ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. బుల్లి కురువ మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి అనే రైతు ఇటీవలే తన ఇద్దరు పిల్లలతో కలిసి అద్దంకి బ్రాంచి కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం నుంచి వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాడు చిరంజీవి. పంట సరిగా పండక పోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దాదాపు 20 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆర్థిక సమస్యల కారణంగా తరచూ భార్య భర్తల మధ్య గొడవ కూడా జరుగుతుంది.. ఇక ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.


 ఈ క్రమంలోనే ఎంతో మనస్తాపం చెందిన చిరంజీవి తన ఇద్దరు పిల్లలు సాయి చైతన్య, సౌమ్య ను తీసుకొని కోటప్పకొండ వెళ్తున్నాం అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. ఇక ఆ తర్వాత అద్దంకి బ్రాంచ్ కెనాల్ వద్దకు చేరుకుని ఇద్దరు పిల్లలతో సహా కాల్వలో దూకాడు. ఇక ఎంతకీ భర్త పిల్లలు ఇంటికి రాకపోవడంతో వెతకడం ప్రారంభించగా చివరికి కెనాల్ వద్ద చెప్పులు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను గాలింపు చేస్తున్నారు  పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: