సెన్సేష్నల్ స్టార్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. వచ్చిన అతి తక్కువ వ్యవథిలోనే హీరోగా మంచి ఇమేజ్ను సంపాదించుకున్నాడీ కుర్ర హీరో. ఇక విజయ్ దేవరకొండ హీరోగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. తన కెరీర్ లో వచ్చిన హిట్స్ అన్నీ ప్రేమకథలే. ఈ నేపథ్యంలో మరో భిన్నమైన ప్రేమకథను ఎంచుకున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించారు. రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లా విజయ్ దేవరకొండతో జతకట్టారు. డియర్ కామ్రేడ్ సినిమా తరువాత మంచి సక్సెస్ అందుకోవాలని చూసిన విజయ్ కి ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఏ మాత్రం కిక్కివ్వలేకపోయింది. ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో రాజి తత్వం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుంది. ప్రేమలో ఒకరిపై మరొకరికి అంతులేని ఆరాధన ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. బ్రేకప్ తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన మనోవేదన అనుభవిస్తారనేది చూపించారు.
అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా దారుణమైన ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటిరోజు అట్టర్ ఫ్లాప్ టాక్ రావడంతో సినిమా కొన్న బయ్యర్లు సగానికి సగం నష్టాలపాలయ్యారు. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు చేయగా.. మొదటి వారంలో కేవలం 8 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. ఫస్ట్ వీక్ తరువాత సినిమా వసూళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో సినిమా నిర్మాణం కోసం పెట్టుబడి పెట్టిన డబ్బు సగానికి పైగానే నష్టాలు పాలైనట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.