తెలుగు సినీ రంగంలో అశేష అభిమానులను సంపాదించిన నటుడు చిరంజీవి. నటనలోనే కాక డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని కళలతోను సంపూర్ణ నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. కింద స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగిన మెగాస్టార్ కి అసలు నటుడు కావాలని స్పూర్తి నింపిన వ్యక్తి గురించి తెలిస్తే అందరికి ఆశ్చర్యం కలగక మానదు. సాధారణంగా ఏ తండ్రి అయినా సినిమాలలో నటించడానికి వెళ్తానంటే వద్దంటారు. కాని తనని నటుడిగా చూడాలనే కోరికతో తన తండ్రి తనని ప్రోత్సహించారని ఒక ఇంటర్వ్యులో చిరంజీవి తెలిపారు. 

 

నా తల్లి తండ్రులే నన్ను ప్రోత్సహించి  నేను ఇంతటి వాడిని అవ్వటానికి కారణం అయ్యారు. అలాంటి తల్లి తండ్రులు ఉన్న నేను చాలా అదృష్టవంతుడిని అని చిరంజీవి ఒక సందర్భంలో చెప్పారు.  చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు నటుడు కావాలని అనుకున్నారు. కాని అది సాధ్యపడక చిన్న చిన్న నాటకాలలో నటించేవారు. స్నేహితుల సాయంతో జగత్ కిలాడీలు, జగత్ జంత్రిలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించారు. అప్పుడు చిరంజీవి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. షూటింగ్ లో జరిగిన సంగతులన్నీ ఇంటికి రాగానే చిరంజీవికి చెప్పేవారు. 

 

ఇక అప్పటి నుండి చిరంజీవికి నటన పై ఆసక్తి కలిగింది. అలా చిన్నతనంలో కలిగిన ఆసక్తిని చిరంజీవి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తండ్రికి చెప్పారు. దానికి వెంకట్రావు గారు సరే అన్నారు. కాని సినిమాల్లో రాణించలేక పోతే ఏమి చేస్తావు అని అడిగారు. దానికి చిరంజీవి రెండు సంవత్సరాలు గడువు అడిగారు. అప్పుడు దానికి ఒప్పుకున్న వెంకట్రావు గారు నటనకు కావాల్సిన సౌకర్యాలు అన్ని కల్పించారు. అలా 1978లో చిరంజీవి నటించిన తొలి చిత్రం విడుదల అయ్యింది. అదే సంవత్సరంలో రెండో సినిమా కూడా విడుదల అవ్వటంతో చిరంజీవి సినీ ప్రస్థానం మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: