మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగానే ఉండే సినిమాల్లో ‘ఖైదీ’ ఒకటి. ఈ సినిమా చిరంజీవికి ఎంతో ప్రత్యేకం. ఆయన అభిమానులకు కూడా ఈ సినిమా అంటే ప్రత్యేక గౌరవం. చిరంజీవిని తమ అభిమాన హీరోగా వారు గుండెల్లో పెట్టుకోవడానికి పునాది వేసిన సినిమా ఇది. అప్పటివరకూ తెలుగు సినిమా వెళ్తున్న గమనాన్ని మార్చిన సినిమా ‘ఖైదీ’. ఈ సినిమాలో చిరంజీవి చేసిన విన్యాసాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చిరంజీవి కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా విడుదలై నేటితో 37 ఏళ్లు పూర్తయ్యాయి.


1983 అక్టోబర్ 28న విడుదలైంది ఈ సినిమా. అప్పటికి చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు పూర్తయ్యాయి. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. ఒరిజినల్ ఫైట్స్, డ్యాన్సుల్లో వేగం, నటనలో చురుకుదనంతో ఖైదీ సినిమా చిరంజీవిలోని అసలైన టాలెంట్ ను బయటకు తీసింది. ఈ సినిమాతో ఇండస్ట్రీని, ప్రేక్షకుల్ని తనవైపుకు తిప్పుకునేలా చేశారు చిరంజీవి. సినిమా స్టార్టింగ్ లో వచ్చే పోలిస్ స్టేషన్ ఫైట్ అప్పట్లో ఓ సంచలనం. ఆ స్థాయి ఫైట్ అప్పటివరకూ ఎవరూ చేయలేదు.. ఏ సినిమాలో రాలేదు. దీంతో చిరంజీవి ఒక్కసారిగా స్టార్ హీరోగా, మాస్ హీరోగా మారిపోయారు.


రాష్ట్రమంతా చిరంజీవి పేరు మోగిపోవడం అప్పటినుంచే ప్రారంభమైంది. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వ ప్రతిభ కూడా ఈ సినిమాలో కీలకం. అప్పటివరకూ ఉన్న పద్ధతుల్ని పక్కన పెట్టి ఈ సినిమా తీశారు. పరుచూరి బ్రదర్స్ కథ, హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే సినిమాకు అదనపు బలం. చక్రవర్తి సంగీతంలోని పాటలన్నీ హిట్టే. భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా 20 కేంద్రాల్లో 100 రోజులు రన్ అయి చిరంజీవి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. సంయుక్తా మూవీస్ బ్యానర్ పై ధనంజయ్ రెడ్డి, తిరుపతిరెడ్డి ఈ సినిమా నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: