దక్షిణాదిలో మంచి విజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్ బాట పట్టడం కొత్తేమీ కాదు. మన దగ్గర మంచి టాక్ వచ్చిన చాలా సినిమాలను హిందీలో రీమేక్ చేసి రికార్డులు బద్దలు కొట్టిన హీరోలు చాలా మందే ఉన్నారు. అంతెందుకు సినిమాలకు వంద కోట్ల క్లబ్ అనే పదాన్ని పరిచయం చేసిన హిందీ ‘గజిని’.. దక్షిణాది సినిమానే. ఇలానే చాలా తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి మంచి విజయాలు సాధించాయి. వాటిలో ‘కిక్’, ‘రెడీ’, ‘రౌడీ రాథోడ్’ వంటి సినిమాల్లో అగ్ర హీరోలు నటించారు. తెలుగులో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ అనే పేరుతో రీమేక్ చేశారు.

ఇది అక్కడ కూడా భారీ విజయం సాధించడంతోపాటు ప్లాపులతో సతమతం అవుతున్న హీరో షాహిద్ కపూర్‌కు మరో ఛాన్స్ వచ్చేలా చేసింది. దీంతో మరో తెలుగు సినిమాపై దృష్టి పెట్టిన షాహిద్.. ప్రస్తుతం నాని నటించిన హిట్ మూవీ ‘జెర్సీ’ సినిమా హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇలా తెలుగులో హిట్ అయిన సినిమాలు రీమేక్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్లాప్ మూవీస్‌ని కూడా రీమేక్ చేయడానికి చూస్తుంటే? ప్రస్తుతం బీవుడ్‌లో ఇదే టాపిక్ నడుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీయార్ నటించిన ఊసరవెల్లి గుర్తుందా? మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

అంతేకాదు ఇటీవల రీమేక్ కథతో గట్టి దెబ్బ తిన్న హీరో అక్షయ్ కుమార్ దీనిలో కూడా నటిస్తారట. ఇటీవలే రిలీజైన అక్షయ్ ‘లక్ష్మీ’ సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో భారీ హిట్ అయిన ‘కాంచన’ చిత్రానికి ఇది రీమేక్. దీన్ని హిందీలో కూడా ఒరిజినల్ డైరెక్టర్ రాఘవ లారెన్సే డైరెక్ట్ చేశారు. మరి ఈసారైనా రీమేక్ కథతో అక్షయ్ భారీ హిట్ కొడతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: