గతంలో ఆర్టీసీలో ఉద్యోగులకి కూడా ఉచిత ప్రయాణ వసతిని తీసేసింది యాజమాన్యం. అలాంటిది.. తర్వాత జరిగిన పరిణామాలతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఇప్పుడు తాజాగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతున్నారు. 2021 జనవరి 1నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని సిబ్బందికి యాజమాన్యం తెలియజేసింది. దీంతో ఆర్టీసీలో పనిచేసే 5వేలమంది ఉద్యోగులకు గొప్ప ఊరట లభించినట్టవుతుంది.

ఏపీఎస్‌ ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతోంది. ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 5 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరు ప్రతి రోజూ తమ నివాసం నుంచి డిపోలకు లేదా ఆర్టీసీ యూనిట్లకు సొంత ఖర్చులతోనే ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యం కల్పించాలని కొద్ది కాలంగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది యాజమాన్యాన్ని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇన్నాళ్లకు సానుకూలంగా స్పందించింది. వీరందరికీ బస్ పాస్ లు ఇవ్వబోతోంది.

ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ ఉచిత బస్‌పాస్‌లు మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్‌ పాస్‌లు చెల్లుబాటవుతాయని చెప్పారు. ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. దీంతో దాదాపు 5వేలమంది ఉద్యోగులకు ఊరట లభించినట్టవుతుంది.

గతంలో కేవలం ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి ఉండేది. కుటుంబ సభ్యులకు ఏడాదిలో కొన్నిరోజులపాటు బస్ పాస్ చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు కొత్తగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా యాజమాన్యం తీపి కబురు అందించింది. ఉచిత బస్ పాస్ లు అందించడానికి సిద్ధమైంది. జనవరి 1నుంచి ఇవి అమలులోకి వస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: