
యువ నేత లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అంశంపై తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ను నియమిస్తారని చెబుతున్నారు. పార్టీ ఆవిర్భవించి మూడు దశాబ్దాలు దాటుతున్నా నేతలుగా దాదాపు అప్పటివారే కొనసాగడంపై యువతరంలో చాలాకాలంగా నిస్పృహ వ్యక్తమవుతోంది. దాంతో లోకేష్‌ను రంగంలోకి దించినట్టయితే తమకు సైతం పార్టీలో అవకాశాలు పెరుగుతాయని వారు యోచిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే మహానాడులో లోకేష్‌కు కీలక బాధ్యతల వ్యవహారం తేలిపోతుందని చెబుతున్నారు. చివరి రెండేళ్లు లోకేష్‌ను కూడా ప్రభుత్వంలోకి తీసుకుని పరిపాలనా అనుభవం ఇప్పించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు. రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గం నుండి ఆయనను ఎన్నికల బరిలోకి దించి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిపదవిని అప్పగించాలనేదే చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.