కృష్ణాజిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం అంటే అంద‌రికీ తెలిసిందే. ఇది.. వైసీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి కొడాలి నానికి కంచుకోట‌. వ‌రుస‌గా ఆయ‌న నాలుగు సార్లు ఇక్క‌డ నుంచి విజ‌యం సాధిస్తూ.. త‌న‌కు తిరుగులేద‌ని.. నిరూపించుకుంటున్నారు. అంతేకాదు.. టీడీపీ నాయ‌కుల‌ను మార్చినా.. వారంద‌రినీ చిత్తుగా ఓడిస్తున్నారు. త‌న‌కు బ‌లం మాస్ ప్ర‌జ‌లేన‌ని చెబుతున్న కొడాలి.. వారికి ఏ క‌ష్ట‌మొచ్చినా.. తాను అండ‌గా ఉంటున్నారు. మ‌రి అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు టీడీపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోందా?  త‌మ‌కు కంట్లో న‌లుసుగా మారిన కొడాలి నానిని ఓడించేందుకు యువ నాయ‌కుడు.. మంత్రి నానికి స‌న్నిహిత మిత్రుడు.. వంగ‌వీటి రాధాను రంగంలోకి దింపుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఒక‌ర‌కంగా చూసుకుంటే.. మంత్రి కొడాలి, రాధాలు స్నేహితులు. కాంగ్రెస్‌లో రాధా ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీలో నాని ఉన్న‌ప్ప‌టికీ.. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం కొన‌సాగింది. ఇక‌, వైసీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత‌. కూడా ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం అలానే ఉంది. అదేస‌మ‌యంలో 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కోసం రాధా ప‌ట్టుబ‌ట్టిన‌ప్పుడు.. పార్టీ నుంచి వెళ్లిపోవాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్పుడు కూడా కొడాలి వెళ్లొద్దు.. ఉండు! అంటూ.. వారించారు. ఆ త‌ర్వాత‌.. అమ‌రావ‌తి ఉద్య‌మంలో రాధా బిజీ అయ్యారు. అయినా కూడా త‌ర‌చుగా .. విజ‌యవాడ‌లో నానితో.. రాధా భేటీలు జ‌రిగాయి.

అయితే.. ఎందుకో.. గ‌త ఆరు మాసాల నుంచి మాత్రం ఇద్ద‌రూ ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉంటున్నారు. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో తెలియ‌క పోయినా.. తాజాగా మాత్రం రాధా పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.  గుడివాడలో వంగ‌వీటి రాధా పర్యటనలు చేస్తున్నారు. ఇక్క‌డి కాపు సామాజికవర్గ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. వాస్త‌వానికి కాపు సామాజిక వ‌ర్గంలో నానిపై అసంతృప్తి ఉంది. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. నాని తీరు వేరుగా ఉంద‌ని..  ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, మంత్రిగా నాని ఇత‌రత్రా వ్య‌వ‌హారాల్లో బిజీగా ఉండ‌డం.. కూడా  ఇక్క‌డ కాపు సామాజిక వ‌ర్గంలో అసంతృప్తి నెల‌కొనేలా చేసింది.

ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా కాపు సామాజిక వ‌ర్గానికిచెందిన రాధా.. ఇక్క‌డ ప‌ర్య‌టించ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న రాధా.. చంద్ర‌బాబు అనుమ‌తి లేకుండా.. ఇక్క‌డ‌కు వ‌చ్చారా? అంటే కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీపైనా.. చంద్ర‌బాబు, లోకేష్‌పైనా.. నాని తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో.. రాధాను ఇక్క‌డ నుంచి పోటీ చేయించే ఆలోచ‌న‌తోనే చంద్ర‌బాబు ఆయ‌న‌ను రంగంలోకి దింపారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. పైగా రాధాకు విజ‌య‌వాడ‌లో టీడీపీ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేదు.

 విజ‌య‌వాడ‌ తూర్పులో గ‌ద్దె రామ్మోహ‌న్‌, ప‌శ్చిమ‌లో జ‌లీల్‌ఖాన్‌(ఈయ‌న పోటీ చేయ‌క‌పోయినా.. ఈయ‌న వ‌ర్గానికే టికెట్ ఇవ్వ‌నున్నారు). సెంట్ర‌ల్‌లో బొండా ఉమా.. ఉన్నారు. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి రాధాకు లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో పొరుగున ఉన్న గుడివాడ అయితే.. కాపుల ఓటు బ్యాంకు బంంగా ఉండ‌డం.. రాధాకు కూడా తెలిసిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. అదేస‌మ‌యంలో త‌మ శ‌త్రువు.. కొడాలి నానిపై ఆయ‌న స్నేహితుడికే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే.. టిట్ ఫ‌ర్ టాట్ అన్న‌ట్టుగా ఉంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: