ఏపీ రాజకీయాల్లో హీట్ మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉండగానే రాష్ట్రంలో రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు భగ్గుమంటున్నారు. సాధారణంగా ఎన్నికలు సమీపించే సమయానికి విమర్శల పర్వం మొదలవుతుంది. కానీ ఏపీలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన సంఘటన చూస్తే ఈ విషయం ఇట్టే అర్ద్జమయిపోయితుంది. తనపై వైసీపీ నేతలు దారుణంగా విమర్శలు చేస్తున్నారంటూ, చంద్రబాబు సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం అయ్యేంతవరకూ అసెంబ్లీలో తిరిగి అడుగుపెట్టబోనని శపథం కూడా చేశారు. చంద్రబాబు ఆవేశంగా ప్రసంగించి, సభనుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెంటే అచ్చెన్నాయుడుతో పాటుగా సభలోని మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లిపోయారు.

అయితే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇకపై అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకున్నారా.. లేక చంద్రబాబు మాత్రమే అసెంబ్లీకి రాకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి చంద్రబాబు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవచ్చు. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో బాబు కన్నీరు కూడా పెట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన బాగానే హార్ట్ అయినట్టు తెలుస్తుంది. అధినేతను ఇంతగా హార్ట్ చేసిన అసెంబ్లీలో తాము కూడా అడుగుపెట్టే ప్రసక్తే లేదని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలతో సమావేశమై, మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే అంశంపై పునరాలోచించే అవకాశం కనిపిస్తోంది.

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం కొత్తేమీ కాదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జగన్ కూడా ఇలాగే అసెంబ్లీని బహిష్కరించారు. జగన్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అప్పట్లో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇదే కోవలో బాబు కూడా నిర్ణయం తీసుకుంటారా.. లేక టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపిస్తారా అనేది వేచి చూడాలి.  ఒకవేళ చంద్రబాబు కూడా ఎమ్మెల్యేల మాటకు తలొగ్గితే మాత్రం అసలు ప్రతిపక్షమే లేని సభని మరో రెండున్నరేళ్లు పాటూ చూడాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ ప్రజాస్వామ్య బద్దంగా ప్రవర్తించాలని.. చట్టాలను, వ్యవస్థలను గౌరవించాలని చెప్పే చంద్రబాబు.. ఎమ్మెల్యేలను సభకు పంపే తీరుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: