ఏపీ సీఎం జగన్ రాజధాని అమరాతికి వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. అందుకే సీఎం అయిన కొన్ని నెలలకే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే సీఎం అయిన కొత్తలో దూకుడు.. ఆలోచనారాహిత్యం.. సరైన సలహాలు ఇచ్చేవారు లేకపోవడం.. న్యాయపరమైన అంశాలపై అవగాహన తక్కువ ఉండటం.. ఇలాంటి కారణాల వల్ల జగన్ కు ఎదురుదెబ్బలు తప్పలేదు. రాజధానిని మార్చాలని జగన్ మనసులో ఎంతో ఉన్నా.. కోర్టు కేసుల కారణంగా ఆ కోరిక నెరవేరలేదు.


దీనికితోడు.. మండలిలో సక్రమంగా బిల్లు ఆమోదం పొందకపోవడం కూడా న్యాయ వివాదాలకు కారణమైంది. రాజధాని రైతులు వేసిన పిటిషన్లు.. ఇతర పిటిషన్ల కారణంగా రాజధాని అంశం ఇన్నాళ్లూ కోర్టుల్లో ఉంది. ఇప్పుడు రోజువారీ విచారణ సాగుతుండటంతో వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందన్న అభిప్రాయం అంతటా నెలకొంది.. ఇలాంటి సమయంలో జగన్ సర్కారు.. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడం రాష్ట్రలోని అన్ని వర్గాలకూ షాక్ లాంటిదే అని చెప్పొచ్చు.


సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరకు సొంత మీడియాలోనూ ఈ వార్తలు రావడంతో జనం ఒక్కసారిగా విస్తుపోయారు.. జగన్ ఏంటి.. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోడం ఏంటి.. అన్న చర్చలు రాష్ట్రవ్యాప్తంగా సాగాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ కొత్త ఎత్తులు వేస్తున్నాడా అన్న సందేహం కూడా కలిగింది. కానీ.. జగన్‌ అంత డైరెక్టుగా యూటర్న్‌ తీసుకుంటాడన్న నమ్మకం కూడా చాలా మందికి కలగలేదు. దీంతో అసలేం జరగబోతోంది అన్న  ఉత్కంఠ అందిరలోనూ నెలకొంది.


ఈ గ్యాప్‌లోనే న్యూస్ ఛానళ్లు తమకు ఇష్టం వచ్చినట్టుగా ఊహాగానాలు ప్రచారం చేసుకున్నాయి. ఆప్షన్ వన్, టూ, త్రీ, ఫోర్ అంటూ తమకు నచ్చిన విధంగా ఊహాగానాలు చేశాయి. కొంపదీసి జగన్ కూడా మోడీ మూడు సాగు చట్టాల వ్యవహారంలో తగ్గినట్టుగా తగ్గేడేమో అనుకున్నారు మరికొందరు. కానీ.. జగన్ మాత్రం తగ్గేది లేదు.. కొత్త చట్టంతో మళ్లీ పకడ్బందీగా వస్తామని సభలో ప్రకటించడంతో సస్పెన్స్ వీడిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: