ఒమిక్రాన్  వేరియంట్ కు మార్చి నాటికి టీకాను తీసుకురానున్నట్టు ఫైజర్ కంపెనీ తెలిపింది. ఇప్పటికే తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పుడు మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు ఫైజర్ నుంచి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోసు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. వ్యాక్సిన్ ను తీసుకోవడంతో పాటు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.

ఇక రాత్రి 10గంటల వరకు కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఓపెన్ చేసుకోవచ్చని.. రాష్ట్రాలు.. యూటీలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. కరోనా వ్యాక్సిన్ సెంటర్లకు ఎలాంటి టైమ్ లిమిట్ లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే కొనసాగుతుండగా.. అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు.. డిమాండ్ ను బట్టి రాత్రి 10గంటల వరకు సెంటర్లు కొనసాగేలా స్టాఫ్ ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది.

మరోవైపు హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగుల కోసం స్పెషల్ యోగా క్లాసులను అందుబాటులోకి తెస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. యోగా వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ.. కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. యోగా క్లాసుల లింకును రేపటి నుంచి వారికి పంపిస్తామనీ.. ఇంటి నుంచే నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ట్రైనర్లను నియమించుకున్నామని పేర్కొన్నారు.

అంతేకాదు కరోనా వైరస్ కట్టడికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. మినహాయింపు కలిగి ఉన్న కార్యాలయాలు మాత్రమే తెరవాలని తెలిపింది. అలాగే అన్ని రెస్టారెంట్లు, బార్లు మూసివేయాలని ఆదేశించిన డీడీఎమ్ఏ.. టేక్ అవేలకు అనుమతి ఇచ్చింది. మొత్తానికి పలు ఫార్మా కంపెనీలు ఒమిక్రాన్ ను జయించేందుకు టీకాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: