పలనాడు శాంతి భద్రతలపై వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్ల పర్వం సాగుతోంది. పలనాడులో టీడీపీ కార్యకర్తలను గ్రామాల్లో ఉండనీయడం లేదంటూ చంద్రబాబు విమర్శించారు. వైసీపీ బాధితుల కోసం గుంటూరులో శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా రాజకీయ జిమ్ముక్కుగా వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబుకు ఏకంగా సవాళ్లు విసురుతున్నారు.


చంద్రబాబు పల్నాడుకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని, నేనొక్కడినే వచ్చి మీకు ఇక్కడి పరిస్థితిని చూపిస్తానని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. ఎక్కడికైనా చర్చకు సిద్ధమని, చంద్రబాబుకు అందుకు సిద్ధమా అని కాసు మహేష్‌రెడ్డి సవాలు విసిరారు. సీఎం వైయస్‌ జగన్‌ వంద రోజుల పాలన ప్రశాంతంగా సాగిందన్నారు. ఓర్చుకోలేకనే టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని మండిపడ్డారు.


మరోవైపు టీడీపీ బాధితుల సమావేశాన్ని వైసీపీ ఏర్పాటు చేసింది. పిడుగురాళ్ల వాసవీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హోం మంత్రి సుచరిత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టీజీపీ కృష్ణారెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ బాధితులు భారీగా హాజరై తమకు జరిగిన అన్యాయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.


అయితే వైసీపీ ఏర్పాటు చేసిన ఈ టీడీపీ బాధితుల సమావేశంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఈ జిమ్మిక్కులు చేస్తున్నారని అంటున్నారు. నిజంగా టీడీపీ హయాలో వైసీపీ కార్యర్తలను వేధిస్తే.. వారంతా అప్పుడు ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు బయటకు రాకుండా ఇప్పుడు టీడీపీకి పోటీగా బాధితుల సంఘం ఏర్పాటు చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఎవరి హయాంలో ఎవరిపై దాడులు జరిగాయో.. బహిరంగ చర్చలో తేలుతుందంటున్నారు వైసీపీ నాయకులు. టీడీపీ నాయకులు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటున్నారు. మరి ఆ బహిరంగ చర్చ అంటూ జరిగితే పల్నాడు రాజకీయం ఓ రేంజ్ లో ఉంటుందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: