అధికారం కోల్పోయి 9 నెలలు దాటిన ప్రతిపక్ష టీడీపీలో గ్రూపు రాజకీయాలు మాత్రం ఇంకా తగ్గలేదు. ఆధిక్యం లేకపోయిన పెత్తనాలు మాత్రం వదలట్లేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఈ పెత్తనాల వల్ల అధికార వైసీపీకి భారీగానే లబ్ది చేకూరేలా ఉంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు టీడీపీ గ్రూపు రాజకీయాలు బాగా కలిసొచ్చేలా ఉన్నాయి.

 

మొన్న 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌పై గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఓటమి పాలయ్యాక, కోడెల మీద పలు ఆరోపణలు రావడంతో ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇక కోడెల మరణంతో నియోజకవర్గంలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. కాకపోతే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు అప్పుడప్పుడు నియోజకవర్గ బాగోగులని పట్టించుకున్నారు.

 

అయితే స్థానిక సంస్థల సమరం జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ని నియమించలేదు. దీంతో నియోజకవర్గంలో గ్రూపులు పెరిగిపోయాయి. కోడెల మరణం తర్వాత సైలెంట్ అయిపోయిన ఆయన తనయుడు శివరాం ఇప్పుడు యాక్టివ్ అయ్యి, కార్యకర్తలతో సమావేశమై తమకు కావల్సిన వారిని ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి అభ్యర్ధులుగా నిలబెట్టారు. ఇదే క్రమంలో రాయపాటి రంగబాబు వర్గం వారు కూడా కొన్ని చోట్ల నామినేషన్స్ వేశారు. అటు ఎమ్మెల్సీ రామకృష్ణ నియోజకవర్గంలో వేలు పెట్టి, స్థానిక సమరంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై సభలు కూడా పెట్టారు.

 

అయితే ఈ ముగ్గురు ఇలా ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి ముందుకెళుతుండటంతో, కార్యకర్తలు కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయారు. ఇక వీరి అనైక్యత అంబటి రాంబాబుకు కలిసొస్తుందని తెలుస్తోంది. పైగా అధికారంలో ఉండటం రాంబాబుకు అడ్వాంటేజ్. దీనిబట్టి చూసుకుంటే సత్తెనపల్లిలో మెజారిటీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. అటు సత్తెనపల్లి మున్సిపాలిటీ కూడా వైసీపీ ఖాతాలో పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికైతే అసెంబ్లీ స్థానిక ఎన్నికల మాదిరిగానే స్థానిక సమరంతో అంబటి తిరుగులేని విజయం దక్కించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: