విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి, ఒంటిచేత్తో గత ఎన్నికల్లో జిల్లా మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను వైసీపీ ఖాతాలో వేసిన బొత్స ఇపుడు ఏటికి  ఎదురీదుతున్నారా. ఆయన ఈసారి పాత మ్యాజిక్ ని రిపీట్ చేయగలరా. లేరా. విజయనగరంలో మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు వైసీపీ పరం అవుతాయా లేదా. ఇదే టెన్షన్ ఇపుడు పార్టీలో  ఉంది. 

 

బొత్స విజయనగరం వైసీపీ రాజకీయాల్లో ఎదురులేని నాయకుడిగా ఉన్నారు. ఆయన జగన్ మంత్రివర్గంలో కీలకమైన మంత్రిగా కూడా ఉంటూ వస్తున్నారు. జగన్ ప్రభుత్వం తరఫున పెద్ద గొంతుతో మాట్లాడే సత్తా ఉన్న మంత్రిగా కూడా ఆయనకు పేరుంది. అటువంటి బొత్సకు విజయనగరంలో బ్రేకులు వేస్తున్నది ఎవరు. అంటే సొంత పార్టీ నేతలేనని అంటున్నారు.

 

బొత్స తన వర్గానికి టికెట్లు అడిగితే విసిరినట్లుగా నాలుగు కార్పోరేటర్ టికెట్లు ఆయన పార్టీకే చెందిన ఎమ్మెల్యే  కోలగట్ల వీరభద్రస్వామి ఇచ్చారట. బొత్స వర్గాన్ని పూర్తిగా విజయనగరం కార్పోరేషన్ రాజకీయాల నుంచి పక్కకు  తప్పించేశారట. దాంతో ఓవైపు  బొత్స మండిపోతున్నారని టాక్.

 

నిజానికి విజయనగరం మేయర్ సీటు కోసం కోలగట్ల తన కుమార్తె శ్రావణిని రెడీ చేసి ఉంచారు. తనకు ఎటూ మంత్రి పదవి దక్కలేదని ఇక  ఆమెను మేయర్ గా చూడాలనుకున్నారు. విషయం తెలిసిన బొత్స కోలగట్ల ఫ్యామిలీకి మేయర్ సీటు దక్కకుండా చేసేందుకు  మేయర్ సీటుని బీసీ రిజర్వేషన్ చేయించేశారు. దాంతో కోలగట్ల మరింతగా మండిపోయారు.

 

ఇపుడు తన మనిషిని అయినా మేయర్ పీఠం పైన కూర్చోబెట్టుకోవాలని కోలగట్ల ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. దాంతో అక్కడ  20 వార్డులు ఉంటే దాదాపుగా అన్నీ తన వర్గం వారికే ఇచ్చేశారు. మంత్రిగా బొత్స చేసిన సిఫారసులను కూడా ఖాతరు చేయకుండా పక్కన పెట్టేశారు. ఈ పరిణామంతో విజయనగరం మేయర్ వైసీపీ పరం అవుతుందా, బొత్స కోలగట్ల వర్గీయుల పోరుతో అసలుకే ఎసరు వస్తుందా అన్న టెన్షన్ పార్టీలో ఉందిట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: