దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోవా వైరస్ విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 3000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2018కు చేరగా తెలంగాణలో 1275 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంపై పంజా విసురుతున్న తరుణంలో నిన్న ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
సీఎంల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన మోదీ కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ ను పొడిగించటానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ప్రధాని మోదీ తొలుత లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయించినా... సీఎంల డిమాండ్ అనంతరం నిర్ణయం మార్చుకున్నారు. లాక్ డౌన్ ను పొడిగించినా భారీ సడలింపులు ఇస్తామని సీఎంలతో చెప్పారు. కానీ మెజారిటీ సీఎంలు లాక్ డౌన్ ను సుదీర్ఘ కాలం పొడిగించాలని... అప్పుడే కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందని చెప్పినట్టు సమాచారం. 
 
ప్రధాని మోదీ మే 17 తరువాత లాక్ డౌన్ ను పొడిగిస్తామని సీఎంలకు చెప్పినట్టు సమాచారం. సీఎంలు సుదీర్ఘ కాలం పొడిగించాలని కోరడంతో లాక్ డౌన్ ను ఎప్పటివరకు పొడిగిస్తారో చూడాల్సి ఉంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, కేరళ, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరినట్టు సమాచారం. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. 
 
కేంద్రం జూన్ నెల వరకు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో లాక్ డౌన్ పొడిగింపు గురించి కీలక ప్రకటన రానుంది. ప్రజా రవాణా గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్ రైళ్ల రాకపోకలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వొద్దని చెప్పగా తమిళనాడు సీఎం రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని.. బస్సులు, రైళ్లపై ఆంక్షలు కొనసాగించాలని చెప్పినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: