తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల హడావిడి అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘భగవద్గీత పార్టీ కావాలా.. బైబిల్ పార్టీ కావాలా...’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో అందరినీ ఆలోచింపజేసేలా స్పందించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బైబిల్, భగవద్గీత, ఖురాన్.. ఏదైనా సరే దేవుడి వాక్కే కదా. నేను వ్యక్తిగతంగా ఇలా విడగొట్టలేను.. సమాజాన్ని అంతగా విడగొట్టడం అంటే చాలా ఇబ్బంది.. నేను అలా మాట్లాడలేను.’’ అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, తాను ఆ మాదిరిగా విడగొట్టి మాట్లాడలేనన్నారు. అలాగే బండి సంజయ్ ఏ సందర్భంలో అలా మాట్లాడి ఉంటారో తనకు తెలియదని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే... దేవాలయాలపై జరిగిన దాడుల విషయమై ఆవేదన చెంది బండి సంజయ్ ఆ విధంగా మాట్లాడి ఉంటారని అన్నారు. అలాగే ఆ స్థాయి వ్యక్తి మనసులో అలాంటి అభిప్రాయమే ఉండి ఉంటే ప్రపంచం ఇలా ఉండదని పవన్ బదులిచ్చారు. తనకు ముస్లింలు, క్రైస్తవుల్లో కూడా అధికంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. మతం అనేది చాలా సున్నితమైన అంశమని.. సమాజాన్ని విడదీసేలా తాను మాట్లాడలేనని చెప్పారు.
 


అలాగే మతాన్ని కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఆపాదించొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగైతే వైసీపీ నేతలు కూడా బైబిల్ పట్టుకుని ప్రచారం చేశారు కదా అని ప్రశ్నించారు. సగటు భారతీయుడిగా.. అందరికీ సమాన హక్కులు ఉండాలని తాను కోరుకుంటానని చెప్పారు. అలాగే ఇక తాను రైతు సమస్యలపై స్పందించినంత బలంగా రామతీర్థం సంఘటన విషయంలో రియాక్ట్ కాలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎందుకంటే మతం అనేది సున్నితమైన అంశమని.. రామతీర్థ యాత్రలో తాను పాల్గొంటే వచ్చే భావోద్వేగాలు వేరుగా ఉంటాయన్నారు. అనవసరంగా అమాయకులు బలి అయ్యే అవకాశం ఉందని, తన అభిమానులు అన్ని మతాల్లో కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక దోషులను పట్టుకోవాలన్నదే తమ ప్రధానమైన డిమాండ్ అని అన్నారు. అలాగే ఈ విషయంలో ప్రభుత్వం ఆనాడే సరిగ్గా పట్టించుకుని ఉంటే ఈ గొడవే ఉండేది కాదని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: