ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో ఈసారి పంచాయతీ ఎన్నికలు రచ్చ రేపాయి. చాలా గ్రామాలలో ఇప్పుడు ఒక రకమైన అశాంత వాతావరణం నెలకొంది. ప్రధాన పోటీ టిడిపి - వైసిపి మధ్య నెలకొని ఉన్నా ఈసారి జనసేన కూడా చెప్పుకోదగ్గ స్థానాలు సాధించింది. దీంతో జనసేన కార్యకర్తలు కూడా మంచి జోష్ లో ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ ఒక జనసేన కార్యకర్త ప్రాణాల మీదకు తెచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని దేవునల్తాడ అనే గ్రామం మంత్రి అప్పలరాజుకు చెందిన స్వగ్రామం. ఈ గ్రామానికి చెందిన ఒక జనసేన కార్యకర్త ఫేస్బుక్లో తమ గెలుపుకు సంబందించిన జోష్ లో ఒక వీడియో పెట్టాడు. 

అయితే దీనికి గ్రామానికి సంబంధించిన చాలా మంది వైసీపీ మద్దతుదారులు ఘాటు కామెంట్లు పెట్టారు. దీంతో జనసేన కార్యకర్త అలాగే వైసిపి మద్దతుదారులు మధ్య కాసేపు కామెంట్ ల యుద్ధం నడిచింది. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజు సోదరుడు చిరంజీవి కూడా మరో పోస్ట్ పెట్టడంతో వివాదం ముదిరింది. నిన్ను ఇంటికి వచ్చి కొడతానని మంత్రి సోదరుడు బెదిరించడమే కాక మంత్రి సోదరుడు తన మీద 30 మందిని తీసుకొచ్చి దాడి చేశాడని జనసేన కార్యకర్త ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో ఆయన తలకు, చేతికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను పలాస ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ దాడిలో జనసేన కార్యకర్తతో పాటు ఆయన తల్లి కూడా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మొత్తం మీద ఈ ఎన్నికలు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో అశాంతిని రేకెత్తించాయని చెప్పచ్చు. ఇప్పటికే చాలా చోట్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలలో ప్రత్యర్ధులు ఇళ్ళలో ప్రవేశించి టీవీ, ఫ్రిజ్ లు సైతం నాశనం చేసే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సంస్కృతి ఎందాకా దారితీస్తుంది అనేది అందరిలో టెన్షన్ పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: